నా వెంట పడితే.. ఉత్తమ్ ఏం చేశాడో అన్ని బయట పెడతా: మాజీ MP వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న టీ- కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ దక్కకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న టీ- కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ దక్కకపోవడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొందరు పార్టీకి రాజీనామా చేయడం, పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంత్ రావు ఎంపీ, ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ అంబర్ పేట్‌లోని తన నివాసంలో వీహెచ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను కాంగ్రెస్ నుండి బయటకు పంపేందుకు కుట్ర చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంబర్ పేట్ వెంట పడుతున్నారని.. అంబర్ పేట్ సీటు తనదని.. ఇక్కడ వేలు పెడితే బాగొదని హెచ్చరించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి అంబర్ పేట్ వెంట పడితే.. నేను ఆయన వెంట పడుతానని వార్నింగ్ ఇచ్చారు. గతంలో అంబర్ పేట్ నుండి గెలిచి తాను మంత్రి అయ్యాయని గుర్తు చేశారు. గతంలో తనపై కేసులు పెట్టిన నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఉత్తమ్ అంబర్ పేట్ సీటు కోసం ఎగదోస్తున్నాడని.. అలాంటి వ్యక్తి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదన్నారు.
నీకు, నీ భార్యకు మాత్రం సీట్లు కావాలి, నాకు మాత్రం వద్దా అంటూ నిలదీశారు. డబ్బులు తీసుకుని పోటీలో వెనక్కి తగ్గుతున్నానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో తన మనుషులు ఏలేటీ మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని బయటకు పంపించారని.. ఇప్పుడు జగ్గారెడ్డి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జగ్గారెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని అన్నారు.
నేను ఎన్నటికీ పార్టీ మారనని, గాంధీ కుటుంబానికి విధేయుడినని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా పనిచేయడం ఆపకపోతే.. ఉత్తమ్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన పనులను బయట పెడతానంటూ వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, పార్టీ కీలక నేత అయిన ఉత్తమ్‌పై సీనియర్ నేత వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.