KTR : సంగారెడ్డిలో విషాద ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ ఇదే

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేట గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్ల 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Update: 2024-10-13 11:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేట గ్రామంలో కలుషిత నీరు తాగడం వల్ల 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు నిలిచిపోవడంతో గ్రామస్తులంతా స్థానిక సంజీవరావు పేటలోని బావి నీటిని తాగుతున్నారు. నీరు కలుషితం కావడంతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, సుమారు సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అలాగే బావిలోని నీటి నమూనాలను అధికారులు సేకరించి పరీక్షలకు పంపినట్లు గ్రామస్తులు చెప్పారు.

ఈ ఘటనపై ఆదివారం మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. తెలంగాణ అంతటా తాగునీరు సరఫరా చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసిందన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి రాష్ట్రమంతటా తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును కూడా సరిగ్గా నిర్వహించలేకపోతుంది రేవంత్ సర్కార్.. అని విమర్శించారు. సంజీవన్‌రావుపేటలో కలుషిత నీటి సరఫరా వల్ల జరిగిన మరణాలు ముమ్మటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే.. అని ఆరోపించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న వారికి తగిన సాయం అందించాలని, తెలంగాణలో మరెక్కడా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Similar News