ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో కల్తీ కల్లు ప్రకంపనలు.. ఇద్దరు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి పది మంది అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది.

Update: 2023-04-12 04:47 GMT

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ప్రతిరోజు ప్రమాదకరమైన ఆల్ఫా జాలం, తదితర మత్తు పదార్థాలతో తయారుచేసిన కల్లు దొరకకపోవడంతో ఆరోగ్యం దెబ్బతిని పాలమూరు జిల్లా కేంద్రంలో రెండు రోజుల తేడాతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు ఐసీయూలో వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. వివరాలలోకి వెళితే పాలమూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో స్వచ్ఛమైన ఈత, తాటికల్లు లేక... కొంతమంది వ్యాపారులు ప్రమాదకరమైన ఆల్ఫా జోలం, తదితర నిషేధిత మత్తు పదార్థాలతో కల్తీ కల్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

కాయ కష్టం చేసుకుని బతుకుతున్న కూలీలు, చిరు ఉద్యోగులు ఖరీదైన మద్యం కొనలేని పరిస్థితులలో కొంత ఉపశమనం కోసం కల్లు కల్లు తాగుతూ వచ్చారు. ప్రమాదకర రసాయన పదార్థాలతో తయారు చేసినది కావడంతో ప్రతిరోజు తాగనిదే నిద్ర పట్టని పరిస్థితికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో కల్లు తయారీకి ఉపయోగించే ఆల్ఫా జోలం కిలో రేట్లు వేల రూపాయల నుండి లక్షల రూపాయలకు చేరడంతో వ్యాపారులు ఆల్ఫా జోలం మోతాదును తగ్గించి కల్లు విక్రయాలు చేస్తున్నడంతో మత్తుకు అలవాటు పడిన జనం ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడి.. పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు.. గత నాలుగైదు రోజుల నుండి 50 మందికి పైగా జిల్లా ఆస్పత్రికి వైద్యం కోసం చేరారు.

వీరిలో కోడూరు గ్రామానికి చెందిన ఆశన్న (58) రెండు రోజుల క్రితం మరణించగా గురువారం పాలమూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన విష్ణు (27) అనే వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. కాగా ఈ అంశంపై వివరాల సేకరణ కోసం వెళ్లిన మీడియా బృందానికి జిల్లా ఆసుపత్రిలో అనుమతి ఇవ్వలేదు. దీంతో మీడియా బృందం సూపరింటెండెంట్‌కు మధ్య వాదనలు జరిగాయి. దీనితో నామమాత్రంగా వివరాలను వెల్లడించి సూపరింటెండెంట్ చేతులు దులుపుకున్నారు. కాగా ఇంతగా జరుగుతున్న ఎక్సైజ్ సిబ్బంది అధికారులు కల్తీకల్లు వ్యవహారానికి సంబంధించి నోరు మెదపకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News