కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం.. కేసీఆర్, రేవంత్ రెడ్డిపై ఈటల సెన్సేషనల్ కామెంట్స్

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-05 11:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ఊరంతా ఒకసాది అయితే ఊసరవెళ్లిది మరొక దారి అన్నట్లుగా స్వార్థ నాయకులు పార్టీ మారితే వారికి నష్టమే తప్ప లాభం ఉండదని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. చేరికల విషయంలో కేసీఆర్ వ్యవహరించినట్లే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, గొర్లమందల మీద తోడేళ్లు పడ్డట్టు నాయకులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో ఈటల పరోక్షంగా ఈ హాట్ కామెంట్స్ చేశారు. కంకర మిషన్లు నడవాలన్న, భూమి సమస్య పరిష్కారం కావాలన్నా మా పార్టీలో చేరాలని నాయకుల ఇళ్లకు వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలందరిలో మూడ్ సెట్ అయిందని, దేశవ్యాప్తంగా మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుంటే కాంగ్రెస్ అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తోందని అయితే బీజేపీ ప్రవాహంలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం అన్నారు. శుక్రవారం లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సూరారం, గాజులరామారం, ఉషోధయకాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు, నాయకుల కుటుంబాలు ఓట్లు వేస్తే గెలవరని ప్రజలు ఓట్లేస్తే గెలుస్తారన్నారు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించకుండా స్వార్థంతో నాయకులు నిర్ణయాలు తీసుకుంటే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అన్నారు.

గతంలో పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారే వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని అన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారని నిలదీశారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లోకి వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారో ప్రజలకు తెలుసని, కడియం శ్రీహరి అసలు దళితుడే కాదన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన్ను పార్టీలో చేర్చుకుని కూతురికి టికెట్ ఇచ్చారని ధ్వజెత్తారు. అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరొకలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కు ప్రజలు ఫుల్ మెజార్టీ ఇచ్చినా తాము వద్దని చెప్పినా వినకుండా బరితెగించి అనైతికంగా ఎమ్మెల్యేలను చేర్చుకుని చిల్లర రాజకీయాలు చేసి చివరకు అధికారని గుర్తు చేశారు.

17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో కొట్లాడతానని రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఆయన ఎవరితో పోరాడుతారని ఎద్దేవా చేశారు. మరో జన్మెత్తిన కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. మోడీకి రాహుల్ గాంధీ మధ్య నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఇప్పుడు మోడీ పాలన ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిదని అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. మూడేళ్లలో అయోధ్య రామాలయాన్ని కట్టించి, ప్రతి ఇంటికి అక్షింతలు పూర్తి చేసిన వ్యక్తి మోడీ అన్నారు. గతంలో ప్రపంచ బ్యాంకు వద్ద మోకరిల్లిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, మల్కాజిగిరి ఓటర్లు మోడీకి మద్దతు తెలిపాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

Tags:    

Similar News