సహకార సంఘాల్లో అవిశ్వాస గండం.. కొనసాగుతున్న సస్పెన్స్!

దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది.

Update: 2024-03-15 03:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఇప్పటికే ప్రధాన పక్షాలు ఎంపీ అభ్యర్థుల ఖరారులో ఉండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం స్థానిక సంస్థలు, సహకార సంస్థల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలప్రదర్శనకు సిద్ధమైంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ వైపు చూడటంతో మొన్నటి వరకు పీఠాల మీద కూర్చున్న నాయకులను మార్చే పని జోరుగా సాగుతోంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఆర్మూర్ బల్దియాలో మున్సిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం పెట్టి తర్వాత ఆలస్యం కారణంగా ఇటీవల కొత్తగా ఇన్‌చార్జి మున్సిపల్ చైర్మన్‌ను నియమించారు. అది కూడా బడ్జెట్ పద్దు ఆమోదం కోసం కావడంతో అక్కడ చైర్మన్ ఎంపిక జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ కొత్త మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంపిక కావడం అది కాంగ్రెస్ మద్దతు ఉన్న వారే బల్దియా పీఠం ఎక్కడం ఖాయమైంది.

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌పై 15 మంది డైరెక్టర్లు తిరుగుబాటు ప్రకటించారు. గత వారం వారు జిల్లా సహకార అధికారికి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు. డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు‌నకు తరలి వెళ్లిపోయారు. ఈ నెల 21న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉండగా తనకు టికెట్ రాగానే డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని ప్రణాళికలు వేశారు. అనూహ్యంగా ఈ నెల 13న జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ పేరును ప్రకటించడంతో డీసీసీబీకి రాజీనామాపై భాస్కర్ రెడ్డి పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కేందుకు మాజీ మంత్రి సహాయంతో ప్రణాళికలు వేసినట్లు సమాచారం. అది కుదరకపోతే అవిశ్వాస తీర్మానం పదవి పోయిన పర్వాలేదు ధీమాగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

నిజామాబాద్ ఇందూరు జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ లిమిటెడ్ చైర్మన్ సాంబారి మోహన్‌పై అవిశ్వాసానికి సిద్దమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఇప్పట్లో ఈ వ్యవహరంపై ఎవరు నోరు మెదపడం లేదు. సాంబారి మోహన్ బాజిరెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతో కచ్చితంగా గద్దె దించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ప్రస్తుతానికి సాంబారి మోహన్ వద్ద మెజారిటీ డైరెక్టర్లను ఉండగా వారు చేజారకుండా చూస్తున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో పాటు ఓటింగ్‌లో మద్దతు తెలిపితే మోహన్‌కు పదవి గండం పొంచి ఉంది. ఉమ్మడి జిల్లాలో పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల్లో పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానాల లొల్లి కొనసాగుతుంది.

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు అందజేశారు. గత వారంలో కామారెడ్డిలో బల్ధియాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి నిట్టూ జాహ్నవిపై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమి తర్వాత అధికార పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అక్కడ మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన ఆధిపత్యాన్ని చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ఉత్తర్వులు వెలువడనున్నాయి.


Similar News