జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం..షెడ్ లోనే నవరాత్రి ఉత్సవాలు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాదేవి ఆలయం గర్భగుడి జలదిగ్బంధంలోనే కొనసాగుతుంది.

Update: 2024-10-08 04:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాదేవి ఆలయం గర్భగుడి జలదిగ్బంధంలోనే కొనసాగుతుంది. దీంతో  అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ప్రాంగణంలోని గోకుల్ షెడ్ లో కొనసాగిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనదుర్గా అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నీలి రంగు వస్త్రంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి వరద వస్తుండటంతో ఆలయం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలో ఉండటంతో మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం భక్తులకు దూరమైంది. అర్చకులు రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు కొనసాగిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లుగా ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం వన దుర్గాదేవి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.


Similar News