Prof. Saibaba: పదేళ్ల తర్వాత స్వేచ్ఛగా బైటకొచ్చా

తెలంగాణ ప్రజలకు చాలాకాలం తర్వాత ఉక్కు కౌగిలి నుంచి విముక్తి లభించిందని ఢిల్లీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అన్నారు.

Update: 2024-08-23 13:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలకు చాలాకాలం తర్వాత ఉక్కు కౌగిలి నుంచి విముక్తి లభించిందని ఢిల్లీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అన్నారు. తెలంగాణలోని ప్రజా ఉద్యమాలే తనకు చదువును, చైతన్యాన్ని నేర్పాయని, అవే తనలో సామాజిక పరివర్తన తీసుకొచ్చి చివరకు గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా కొట్లాడేలా నడిపించాయన్నారు. నన్ను వ్యక్తిగా తీర్చిదిద్దిన తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు అడుగు పెట్టడం గొప్ప అనుభూతి అని గుర్తుచేసుకున్నారు. సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నందుకు తనపైన కేసులు పెట్టి పదేళ్ళు జైల్లో పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఒక టీచర్‌గా, హక్కుల కార్యకర్తగా కొనసాగుతూనే ఉంటానని స్పష్టం చేశారు. మరింత మెరుగైన సమాజం కావాలని, కులవ్యవస్థను నిర్మూలించాలని కోరుకునేవారితో పాటు ప్రజాస్వామిక జీవితం, హక్కుల గురించి మాట్లాడేవారూ చాలా మంది ఉన్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం రాజకీయ ఉద్యమాలేవీ మొదలుకాకముందే వరంగల్ డిక్లరేషన్ పేరుతో ప్రజాస్వామిక తెలంగాణ అంశాన్ని చర్చించామని, ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ వచ్చానని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు ప్రొఫెసర్ జయశంకర్‌తో కొన్ని రోజుల పాటు తాను చర్చల్లో పాల్గొన్నానని గుర్తుచేశారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ అనుబంధం) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్‌’లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా కొట్లాడినందుకు, ఆదివాసీల తరఫున పోరాడినందుకు పోలీసులు తనపైన కేసులు పెట్టినా ఇప్పుడు ఆదివాసులే ముందుకు వస్తున్నారని సాయిబాబా గుర్తుచేశారు.

గ్రీన్‌హంట్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొంటున్నందునే తనను అరెస్టు చేసిన పోలీసులు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనే కేసులు పెట్టారని ప్రొ. సాయిబాబా ఆరోపించారు. ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉండకుంటే తప్పుడు కేసులు పెడతామంటూ పోలీసులు హెచ్చరించారని, వారి బెదిరింపులకు లొంగనందువల్లనే అరెస్టు చేశారని తెలిపారు. ఢిల్లీలో ఉన్న తనను కిడ్నాప్ చేసి గడ్‌చిరోలి కోర్టులో హాజరు పరిచారని, సమాజం సైలెంట్ కావాలన్నదే వారి ఉద్దేశమన్నారు. ఢిల్లీలో ప్రొఫెసర్‌గా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నానని, అనేక రాజకీయ పార్టీల నాయకులు సంప్రదించేవారని గుర్తుచేశారు. చివరకు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించి చిత్రహింసలు పెట్టారని పేర్కొన్నారు. మహారాష్ట్ర జైళ్ళలో రాజ్యాంగం పనిచేయదని, అక్కడ ఖైదీలను చిత్రహింసలకు గురిచేసే అవకాశం ఉన్నదన్నారు. అందుకే వీల్‌చైర్ ఉంటే తప్ప కదలలేని తనను అది వీలుకాని సెల్‌లో పెట్టారని గుర్తుచేశారు.

చిన్నప్పటి నుంచి పోలియో ఉన్న తనకు మహారాష్ట్ర జైలుకు వెళ్ళిన తర్వాత పక్షవాతం వచ్చిందని, దాని ప్రభావం ఊపిరితిత్తుల మీద పడిందని, చివరకు 21 రకాల కొత్త అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. అక్కడి జైళ్లలోనూ కులవ్యవస్థ కొనసాగుతున్నదని, కులానికి తగినట్లుగా టాయ్‌లెట్ల క్లీనింగ్ మొదలు రకరకాల పనుల్ని అప్పగించేవారన్నారు. మహారాష్ట్రకు చెందిన మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, సంజయ్ రౌత్ తదితరులు కూడా ఈ జైల్లోని పరిస్థితులను చూసి బతకలేమంటూ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఆదివాసులపై దాడులు ఆపాలనే డిమాండ్‌తో పలువురు మేధావులతో కలిసి ఉద్యమం చేశామని, ఇతర దేశాల్లో ఆదివాసీలను అంతం చేసినట్లే ఇక్కడ కూడా అవే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మైనింగ్ పేరుతో వారిని ఆవాసాల నుంచి ఖాళీ చేసి బైటకు పంపిస్తున్నారని ఆరోపించారు. బస్తర్‌లో ఇప్పుడు జరుగుతున్నది అదేనని అన్నారు.

కేవలం ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నందుకే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, భీమా కోరేగావ్ కేసులో తాను లేకపోయినా కేసు పెట్టారని, తన కేసును కోర్టులో వాదించినందుకు సురేంద్ర గార్లింగ్‌పైనా కేసు పెట్టారని తెలిపారు. జైళ్ళకు వచ్చిన రౌడీలు తక్కువ సమయంలో బయటకు వెళ్తారని, కానీ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవారికి మాత్రం చిత్రహింసలు తప్పట్లేదన్నారు. ‘ఉపా’ చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇప్పుడు బీజేపీ దాని కొమ్ములు తొలగించి మరింత కఠినంగా అమలు చేస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు.


Similar News