సీఎం కేజ్రీవాల్ పై సీబీఐ ప్రశ్నల వర్షం.. తొమ్మిదిన్నర గంటలు సాగిన ఎంక్వయిరీ
దిశ, తెలంగాణ బ్యూరో : మొన్నటి వరకు ఆప్ నేతలు, ఢిల్లీ డిప్యూటీ సీఎం వరకే పరిమితమైన లిక్కర్ స్కాం కేసు ప్రస్తుతం ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరకు వచ్చింది. ఆదివారం సీబీఐ ఎదుట విచారణ ఆయన హాజరయ్యారు. అధికారులు ఆయనను సుమారు తొమ్మిదిన్నర గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 11.10 గంటలకు సీబీఐ హెడ్‌క్వార్టర్‌కు హాజరైన ఆయన రాత్రి తొమ్మిది గంటల తర్వాత బయటకు వచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ముసాయిదా డాక్యుమెంట్ తయారీ మొదలు అర్ధంతరంగా గత ఏడాది జూలైలో నిలిపి వేసేంతవరకు చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులు ఆరా తీశారు. పాలసీకి సంబంధించి మొత్తం 56 ప్రశ్నలు అడగడంతో పాటు సీఎంగా ఆయన ప్రమేయంపై ఆరా తీశారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయనను ఒక సాక్షిగానే సీబీఐ అధికారులు పిలిచి వివరాలు సేకరించిన తర్వాత సీఆర్‌పీసీలోని సెక్షన్ 161 ప్రకారం ఆయన నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (2021-22)కి ఏడాది ముందే ఆ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రూపొందించిన ముసాయిదా పాలసీ మొదలు లాంఛనంగా అమల్లోకి వచ్చేంత వరకు కేజ్రీవాల్ ప్రమేయంపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఢిల్లీ ఎక్సయిజ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సీ అరవింద్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని వివరాలతో పాటు కస్టడీలో మనీశ్ సిసోడియా వెల్లడించిన వివరాల ఆధారంగా కేజ్రీవాల్ నుంచి అనేక అంశాలను అధికారులు రాబట్టినట్లు తెలిసింది. పాలసీని ఫైనల్ చేయడంలో చోటుచేసుకున్న ప్రొసీజరల్ లోపాలు, చీఫ్ సెక్రటరీ సహా ఎక్సయిజ్ కార్యదర్శి తప్పుపట్టడం, లెఫ్టినెంట్ గవర్నర్ లేవనెత్తిన సందేహాల గురించి అధికారులు కేజ్రీవాల్‌ను అడిగి తెలుసుకున్నారు.
విజయ్ నాయర్, దినేశ్ అరోరా పాత్రపైనా..
ఆప్‌కు కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జిగా వ్యవహరించిన విజయ్ నాయర్, మనీశ్ సిసోడియాకు సన్నిహితంగా ఉండే దినేష్ అరోరా.. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలో జోక్యం చేసుకోవడం, వారితో ఫోన్‌లో మాట్లాడడం, ఢిల్లీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని వారు కొంతకాలం వాడుకోవడం, లిక్కర్ వ్యాపారులతో సెక్రటేరియట్‌లోని కాన్ఫరెన్సు హాలులో సమావేశం ఏర్పాటు చేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో చర్చలు జరగకుండానే ముసాయిదా పాలసీలో టాక్స్ స్ట్రక్చర్‌లో మార్పులు జరగడం, అందుకు కేజ్రీవాల్ నివాసం వేదిక కావడం, కొత్త పాలసీతో ప్రభుత్వ ఖజానాకు నష్టం ఏర్పడడం, లిక్కర్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చడానికే నిబంధనలను సడలించడం... ఇలాంటి అనేక ప్రశ్నలకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం.
విజయ్ నాయర్ సాయంతో ఇండో స్పిరిట్స్ కంపెనీ అధినేత సమీర్ మహేంద్రుతో ఫేస్‌టైమ్‌లో కేజ్రీవాల్ మాట్లాడినట్లు పలువురి స్టేట్‌మెంట్లలో వెల్లడైన అంశాలపైనా అధికారులు ఢిల్లీ సీఎంను ప్రశ్నించినట్టు తెలిసింది. ఎక్సైజ్ పాలసీ తయారీలో జరిగిన తతంగంపై ఇప్పటికే కార్యదర్శి అరవింద్, కమిషనర్ అరవ గోపీకృష్ణ నుంచి వివరాలను సేకరించిన సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్ నుంచి సైతం వివరణ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే సీబీఐ దగ్గర విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, మనీశ్ సిసోడియా, పలువురు నిందితులు, అనుమానితులు, సాక్షుల స్టేట్‌మెంట్లు ఉన్నాయి. అందులో కేజ్రీవాల్‌కు ఉన్న ప్రమేయంపైనా సీబీఐ అధికారులు తాజా ఎంక్వయిరీలో ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. మనీశ్ సిసోడియాను కస్టడీలోకి తీసుకున్నప్పుడు వెల్లడించిన అంశాలను ప్రస్తావించి క్రాస్ వెరిఫికేషన్ కోసం కేజ్రీవాల్ స్పందనను కూడా సీబీఐ రికార్డు చేసింది.
సౌత్ గ్రూపు లింకులు, కిక్‌బ్యాక్స్ పై ఆరా..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఫైనల్ చేయడంలో సౌత్ గ్రూపు కీలక భూమిక పోషించిందని, అందులో ఆప్ తరపున విజయ్ నాయర్ యాక్టివ్ రోల్ పోషించారన్నది సీబీఐ అభియోగం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలువురి నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్లలోనూ ఇవే అంశాలు వెల్లడి కావడంతో.. వీటికి సంబంధించిన వివరాలను కేజ్రీవాల్ నుంచి సేకరించినట్టు తెలిసింది. సౌత్ గ్రూపులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఉన్నట్టు సీబీఐ, ఈడీ అధికారులు వేర్వేరు చార్జిషీట్లలో పేర్కొన్నారు.
హైదరాబాద్, ఢిల్లీ హోటళ్లలో జరిగిన చర్చల్లో టాక్స్ స్ట్రక్చర్‌లో మార్పులు చేయాల్సిందిగా ఈ గ్రూపు నుంచి ప్రతిపాదనలు రావడంతో ఫైనల్ పాలసీలో ఆ మేరకు మార్పులు జరిగినట్లు పేర్కొన్నారు. లిక్కర్ వ్యాపారులకు లబ్ధి చేకూరేలా మార్పులు చేసినందువల్ల కిక్ బ్యాక్స్ రూపంలో వారి నుంచి ముడుపులు అందాయని, అడ్వాన్సుగా అందుకున్న కొంత మొత్తాన్ని గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వినియోగించినట్టు చార్జిషీట్లలో పేర్కొన్న అంశాలను సీబీఐ అధికారులు కేజ్రీవాల్ నుంచి రాబట్టినట్టు తెలిసింది. లిక్కర్ పాలసీ తయారీ కోసం కసరత్తు మొదలైనప్పటి నుంచి చివరిదాకా చోటుచేసుకున్న కీలక ఘట్టాలపై కేజ్రీవాల్ నుంచి వివరాలను సేకరించినట్టు సీబీఐ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
ఇతరుల స్టేట్‌మెంట్లతో పోల్చి చూస్తాం : సీబీఐ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను లిక్కర్ స్కామ్‌లో ఒక సాక్షిగానే పిలిచామని, ఆయన ప్రమేయం గురించి దర్యాప్తునకు అవసరమైన వివరాలన్నింటినీ తెలుసుకుని సీఆర్‌పీసీ 161 ప్రకారం స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని సీబీఐ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆయన ఇచ్చిన సమాధానాలను నోట్ చేసుకున్నట్టు పేర్కొన్నది. అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన రిప్లై ఇచ్చారని వివరించింది. ప్రస్తుతం ఈ స్కామ్ దర్యాప్తు కొనసాగుతూ ఉన్నందున కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానాలను ఇతర నిందితులు, అనుమానితుల నుంచి సేకరించిన వివరాలతో పోల్చి చూస్తామని, దానికి అనుగుణంగానే తదుపరి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని పేర్కొన్నది. ఇప్పటికే తమ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానాలను వెరిఫై చేస్తామని తెలిపింది. ఎంక్వయిరీకి కేజ్రీవాల్ సహకరించారని, సమాధానాలను దాటవేయలేదని స్పష్టత ఇచ్చింది. మనీశ్ సిసోడియాను ప్రశ్నించిన తర్వాత వెల్లడైన అంశాల ఆధారంగా కేజ్రీవాల్‌ను ఎంక్వయిరీ చేయడం గమనార్హం.
కేజ్రీవాల్ ఎంక్వయిరీపై గులాబీ ఆసక్తి..
కేజ్రీవాల్‌ను సీబీఐ ఎంక్వయిరీకి పిలవడంతో ఆయన ఏం సమాధానాలు ఇస్తున్నారనే ఉత్కంఠ కొంత మంది గులాబీ పార్టీ నేతల్లో నెలకొన్నది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను సీబీఐ గతేడాది డిసెంబరు 11న ఆమె నివాసంలో దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది. ఈడీ అధికారులు సైతం మూడు దఫాలుగా దాదాపు 30 గంటల పాటు ఆమెను ఎంక్వయిరీ చేశారు. ఆమె వాడిన ఫోన్లను సైతం ఈడీ అధికారులు పరిశీలించారు. సీబీఐ అధికారులు తాజా ఎంక్వయిరీలో కేజ్రీవాల్ నుంచి ఎలాంటి వివరాలను తీసుకున్నారనే ఆసక్తి గులాబీ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఆయన వెలిబుచ్చిన అంశాల ఆధారంగా తదుపరి ఎంక్వయిరీ ఏ టర్న్ తీసుకుంటుంది, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, ఈడీ ఈ వివరాలను తీసుకున్న తర్వాత తదుపరి ఎంక్వయిరీపై ఎలాంటి ఫోకస్ పెడుతుందనే ఆసక్తి మొదలైంది.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ ప్రజలపై కామెంట్స్.. వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్