ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అరికట్టండి : సీఎస్ శాంతికుమారి

సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఫోకస్ పెంచాలని సీఎస్ శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.

Update: 2024-08-14 15:49 GMT


దిశ, తెలంగాణ బ్యూరో : సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులపై ఫోకస్ పెంచాలని సీఎస్ శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక అనవసరమైన వైద్యం అందించే వాళ్లను కూడా గుర్తించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, ఎప్పటికప్పుడు రెయిడ్స్ చేయాలన్నారు. జిల్లాల వారీగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో మీటింగ్ లు నిర్వహించి, స్ట్రిక్ట్ గా ఆదేశాలివ్వాలన్నారు. పేద ప్రజలపై దోపిడి చేస్తే ఊపేక్షించేది లేదని నొక్కి చెప్పారు. బుధవారం ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ జ్వరాలు, డెంగ్యూ, చికెన్‌ గునియా తదితర వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు కలెక్టర్లు పటిష్టమైన నిఘా ఉంచాలని సూచించారు.

స్కూళ్లు, హాస్టళ్లు తిరగండి...

రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల తీవ్రతను తగ్గించేందుకు సమిష్టి కృషితో వర్క్ చేయాలని సీఎస్ శాంతికుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్లతో పాటు జిల్లాలోని ఇతర ఉన్నతాధికారులు అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, సందర్శించి జ్వర సర్వేను వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు పిల్లలకు జ్వరాలు ఇతర వ్యాధులు సంబవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. హాస్టళ్లు, పాఠశాలలు, తదితర సంస్థలలో ఆహారం, పారిశుధ్యాన్ని కూడా తనిఖీ చేయాలని తెలిపారు. కలెక్టర్లు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సందర్శించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన నాణ్యమైన సేవలు అందుతున్నాయా? లేదా? అని పరిశీలించాలన్నారు. అవసరమైన మేరకు టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఫ్రైడే డ్రై డే ప్రచారాన్ని కచ్చితంగా కొనసాగించాలని అన్నారు. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను యాక్టివేట్ చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాలలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇక ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్‌లను సీఎస్‌ అభినందించారు. ఇది నిరంతర కార్యక్రమమని బ్యాలెన్స్ ప్లాంటేషన్‌ను కూడా పూర్తి చేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మెరుగుపరచడానికి దృష్టి సారించాలని అన్నారు. కుక్కల బెడద సమస్యను పరిష్కరించేందుకు వీధికుక్కలకు స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డైరెక్టర్ గౌతమ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.        


Similar News