గురుకులాలను శిథిలం చేసే కుట్ర : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్పీ

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలను శిథిలం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

Update: 2024-09-04 17:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలను శిథిలం చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో అంతర్జాతీయ స్థాయిలో న్యాయమైన గురుకుల విద్య అందించారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో ఎస్సీలు సమిధలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ గురుకులాల్లో 2వేల మంది ఉపాధ్యాయులను రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగించారని, రాజ్యాంగ బద్దంగా, చట్టబద్ధంగా నిబంధనలకు లోబడి నియామకాలు జరిగిన వారిని తొలగించారని ఆరోపించారు. దీంతో రెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో గతంలో ఇంజనీర్లు, డాక్టర్లు అయితే... ఇప్పుడు మళ్లీ పశువులు కాసే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. వాటిని ఎత్తివేసే కుట్రకు తెరలేపారన్నారు. వెయ్యి మంది డాక్టర్లను చేసిన గౌలిదొడ్డి గురుకులంలో ఉపాధ్యాయులు సమ్మె చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పేద పిల్లల కోసం ఏర్పాటు చేసిన క్రీడా అకాడమీలు మూత పడ్డాయని అన్నారు. రుక్మాపూర్ గురుకుల సైనిక పాఠశాల, భువనగిరి సైనిక కళాశాల నుంచి సైనిక అధికారులు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యూజిక్, ఒకేషనల్ కళాశాలల నుంచి సిబ్బందిని తొలగించారన్నారు. పేద విద్యార్థులు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపం? అని ప్రశ్నించారు. అన్ని వర్గాల వారు మేల్కొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర నుంచి గురుకులాల నుంచి కాపాడుకోవాలని కోరారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News