Congress: మూసీ శుద్ధీకరణలో కుట్రలొద్దు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మూసీ శుద్ధీకరణలో బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేయోద్దని, విష రసాయనాలతో ఇప్పటికే మూడు జిల్లాల ప్రజలు అన్నీ కోల్పోయారని, ఒక సారి మూసీ గ్రామాలను పర్యటించాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-30 14:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ శుద్ధీకరణలో బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేయోద్దని, విష రసాయనాలతో ఇప్పటికే మూడు జిల్లాల ప్రజలు అన్నీ కోల్పోయారని, ఒక సారి మూసీ గ్రామాలను పర్యటించాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మూసీ సుందరీకరణపై ప్రకటన విడుదల చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ అంటే.. ఒక్కప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు జీవనాడిగా ఉండేది. కానీ ఇప్పుడు విషంగా మారిందని, అలాంటి మురికి కూపం నుంచి సుమారు 25లక్షల మంది జీవితాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మూసీ శుద్ధి పేరుతో వెయ్యి కోట్లు దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రోజుకో కుట్రతో రాజకీయం చేస్తుండటం అత్యంత దారుణమని అన్నారు. ఒకప్పుడు ఈ నది నీరుతాగితే సర్వరోగాలు మాయమయ్యేవి. కానీ ఇప్పుడు తాగటం కాదు కదా.. ఈ నీటితో పండే పంటలు సైతం ఎవరు కొనలేని, తినలేని పరిస్థితి నెలకొందని తెలిపారు.

ఇక్కడ పండే పంటలను రైతులు దొంగతనంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చారని, దీనికి కారణం ఇండ్రస్ట్రియల్ ఏరియాల నుండి విష రసాయనాలు నేరుగా ఇందులో వదలేయటమేనని చెప్పారు. అంతేగాక హెచ్ఎండీఏ పరిధిలోని ఇళ్ల నుండి వచ్చే డ్రైనేజీ నీళ్లు, వ్యర్థ పథార్థాలన్నీ మూసీలోనే కలుస్తున్నాయని తెలిపారు. దీనిలో ఎస్టీపీలు, ఈటీపీలు పెట్టి నీటిని శుద్ధి చేయకుండానే వదులుతున్న కారణంగా.. చెరువుల్లో చేపలు, గడ్డిమేసే పశువులు, నీళ్లు తాగే పక్షులు సైతం పునరుత్పత్తిని కోల్పోయినట్లు పరిశోధనలు తేల్చాయని అన్నారు. అలాగే మూసీ నీటితో పండే పంటల్లో భారలోహాలు(హెవీ మెటల్స్) ఉన్నాయని, వీటిని తింటే.. తీవ్ర ఆనారోగ్యం పాలవుతున్నారని, అందుకే.. శుద్ది చేయమంటున్నామని తెలిపారు. మూసీ శుద్ధీకరణ వల్ల జీహెచ్ఎంసీకి ముంపు ప్రమాదంతో పాటు ఇప్పటికే ఫ్లోరైడ్ పీడతో నలిగిపోయిన ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాకు విషపునీటి నుండి విముక్తి కలుగుతుందని చెప్పారు.

అంతేగాక మూసీ నది శుద్దీకరణ, సుందరీకణ ప్రాజెక్ట్ నిరాశ్రయులయ్యే కుటుంబాలకు మూసీ టూరిజం జోన్లలో ఉద్యోగాలు, ఉపాధి కోసం స్టాల్స్ కేటాయింపు, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కోరారు. వారందరిని భయంతో కాకుండా పరిస్థితిని వివరించి, భవిష్యత్ పై భరోసానిచ్చి సహకరించమని కోరాలని, అందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక మూసీ శుద్ధీకరణ ఆగిపోతే పీడిత గ్రామాలన్నీ మానవ రహిత ప్రాంతాలుగా మారే ప్రమాదం ఉందని, మూసీ శుద్దీకరణను అడ్డుకునే కుట్రలో పాలుపంచుకుంటున్న బీఆర్ఎస్ నాయకులను త్వరలో మేము మూసీ తీర ప్రాంతాలకు తీసుకువెళ్లి చూపిస్తామని తెలిపారు. మీరు రాకపోతే మీ ఇళ్ల వద్దకు ఈ ఊళ్ల ప్రజలను తీసుకువస్తామని, అప్పటికీ మీరు స్పందించకపోతే మూసీ బాధిత లక్షల కుటుంబాలతో ఈ ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు వాస్తవ పరిస్థితులు గుర్తెరికి రాజకీయాలు చేయాలని, విషం తాగుతూ, జీవితాలే మురుగు పాలైన లక్షలమంది జీవితాలతో ఆటలాడుకొవద్దని రాజగోపాల్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.


Similar News