ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు.. కేటీఆర్‌కు కొండా సురేఖ వార్నింగ్

వెనకబడిన కులానికి (బీసీ) చెందిన మహిళను అయినందునే కేటీఆర్ తన కుల దురహంకారంతో తనపై సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియా వేదిక

Update: 2024-09-30 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వెనకబడిన కులానికి (బీసీ) చెందిన మహిళను అయినందునే కేటీఆర్ తన కుల దురహంకారంతో తనపై సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా తనను ట్రోలింగ్ చేస్తున్నారని, ఈ వీడియోలను ఆయన తన తల్లి, చెల్లికి చూపించాలని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఇకపై తనను ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదంటూ కేటీఆర్‌కు మంత్రి వార్నింగ్ ఇచ్చారు. అనేక పార్టీల కేడర్, లీడర్లు తనను అక్కా అని, తన భర్తను బావ అంటూ పిలుస్తారని, మెడలో ఒక ప్రజా ప్రతినిధి చేనేత నూలుపోగు దండను సైతం రాజకీయ విమర్శలకు వాడుకుని వ్యక్తిగతంగా తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు చేస్తున్న పోస్టింగులపై కంట తడి పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు.

చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా అని కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ తన ఆవేదనను వ్యక్తం చేశారు. మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడుతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో తాను ఉన్న సమయంలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఇంకే మహిళకూ కేబినెట్‌లో చోటు కల్పించలేదని అప్పటి పరిణామాలను వివరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్‌లో ఊహించని మార్పులు జరిగాయని, నేతలు డబ్బు, అధికార మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యక్తిగతంగా తనను ట్రోల్ చేస్తూ నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్‌లో కొద్దిమంది పోగై ట్రోల్ చేస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నరని ఆరోపించారు. చివరకు ఆ సోషల్ మీడియా పోస్టింగులకు వ్యతిరేకంగా తెలంగాణ భవన్‌కు తన అభిమానులు, తన పార్టీ కార్యకర్తలు తనకు మద్దతు వెళ్తే వారిని కొట్టారని గుర్తుచేశారు.

అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ లీడర్లు పిచ్చిపట్టి దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. నిన్నమొన్నటి దాకా జైలులో ఉన్న కవిత కూడా ఒక మహిళేనని, ఆమె విషయంలో బాధ పడలేదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. పనిగట్టుకుని ఇప్పుడు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ కుటుంబాల్లో మహిళలపైనా ఇలాంటి ట్రోలింగ్ జరిగితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా మెదక్ జిల్లాకు తాను ఇటీవల వెళ్ళానని, అక్కడి ఎంపీ రఘునందన్‌రావు చేనేత సమస్యలపై తనతో మాట్లాడి ఒక మంత్రిగా తనపై గౌరవంతో చేనేత నూలుపోగులతో తయారు చేసిన మాలను తన మెడలో వేశాశారని, దాన్ని పరీక్షగా చూశానని, చేనేత వృత్తికి సంబంధించిన గౌరవప్రదమైన నూలుగా భావించానని ఆమె గుర్తుచేశారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ పరిస్థితిని గమనంలోకి తీసుకున్న ఎంపీ రఘునందన్ ఆ తర్వాత తనకు ఫోన్ చేసి క్షమించాలంటూ రిక్వెస్టు చేశారని మంత్రి గుర్తుచేశారు. ఇంకోసారి ఇలాంటి ట్రోలింగ్‌లకు పాల్పడితే కేటీఆర్‌కు తగిన బుద్ధి చెప్పక తప్పదని, తన అభిమానులు, తనకు మద్దతు పలికే ప్రజలు పరిగెత్తించి కొడతారని హెచ్చరించారు. ట్రోలింగ్ చేస్తున్న వీడియోపై స్పందించాలని కేసీఆర్ భార్యకు మంత్రి కొండా సురేఖ సలహా ఇచ్చారు. ఆ వీడియోలో, ఫొటోలో తప్పు ఏమున్నదో కేసీఆర్ భార్య శోభమ్మ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజికంగా ఉన్నత వర్గం (కులం) అనే అహంకారం కేటీఆర్‌లో కనబడుతున్నదన్నారు. కొద్దిమంది హరీశ్‌రావు డీపీ (డిస్‌ప్లే పిక్చర్) పెట్టుకుని ట్రోల్ చేస్తున్నరని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేటీఆర్, హరీశ్‌రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిలో సంప్రదాయబద్ధంగా జరిగే బతుకమ్మ ఉత్సవాలను తప్పుదారి పట్టించేలా కొత్త రకమైన నృత్యాలను తీసుకొచ్చి సహజత్వాన్ని కవిత చెడగొట్టారని ఆరోపించారు.


Similar News