Raghunandan Rao: కేసీఆర్ ఫాంహౌజ్‌ను జాతికి అంకితం చేయాలి
కేసీఆర్ ఫాంహౌజ్(KCR Farmhouse)ను జాతికి అంకితం చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ఫాంహౌజ్(KCR Farmhouse)ను జాతికి అంకితం చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్క్(Indira Park) ధర్నా చౌక్ వేదికగా సోమవారం బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో పాల్గొన్న రఘునందన్ రావు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌజ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, రోజుకో శాసనసభ నుంచి రైతులను తీసుకెళ్లి ఏడాదికి రూ.కోటి ఎలా సంపాదించాలో నేర్పించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్.. ఫాంహౌజ్‌ను జాతికి అంకితం చేస్తారా? తెలంగాణకు అంకితం చేస్తారో తమకు తెలియదని కానీ రైతులకు న్యాయం చేయాలని ఆయన పట్టుపట్టారు.
కాళేశ్వరం పేరుతో దోచారా? దాచుకున్నారా? అనేది పక్కన పెడితే.. కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లను దుర్వినియోగం చేసిందని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. రేవంత్ ఈ లక్ష కోట్లను కక్కిస్తామని ఎంపీగా ఉన్న సమయంలో ప్రగల్భాలు పలికారని, అధికారంలోకి వచ్చాక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయిస్తున్నారని ఫైరయ్యారు. సిట్టింగ్ జడ్జి రేవంత్‌కు దొరకలేదా? అని ఆయన ప్రశ్నించారు. 10 ఏండ్లలో బీఆర్ఎస్ ఎంత బద్నాం అయిందో.. కేవలం 10 నెలల్లో కాంగ్రెస్ అంతకంటే ఎక్కువ బద్నాం అయిందని ఆయన విమర్శలు చేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆయన ధ్వజమెత్తారు.