ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి భూమి ఇవ్వొద్దు : సర్కార్ కు పూర్వ విద్యార్థుల సంఘం విజ్ఞప్తి

అంబేద్కర్ వర్సిటీ భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-30 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అంబేద్కర్ వర్సిటీ భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్ వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ వర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పూర్వ విద్యార్థులతో పాటు విశ్వవిద్యాలయ నోడల్ ఆఫీసర్ డాక్టర్ బానోత్ ధర్మ, అసోసియేషన్ అధ్యక్షుడు సాకా వెంకటేశ్వర్ రావు, సెక్రటరీ డాక్టర్ ఉదయిని, కార్యవర్గ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నత విద్యా వ్యాప్తిలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు, మహిళలకు తక్కువ ఫీజులతో ఉన్నత విద్యనందిస్తోందని, అలాంటి విశ్వవిద్యాలయ భూమిని వేరే విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయాలకు తమ అసోసియేషన్ పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు సమావేశంలో తీర్మానించారు. 10 ఎకరాల భూమి కేటాయింపు నిర్ణయాన్ని ఉపసంహారించుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News