హైడ్రా, మూసీపై బీఆర్ఎస్, బీజేపీ వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి : టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
రాజకీయ కుట్రలో భాగంగానే హైడ్రాపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ధ్వజమెత్తారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయ కుట్రలో భాగంగానే హైడ్రాపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ధ్వజమెత్తారు. చెరువులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు నాలాలు, మూసీ ప్రక్షాళనపై బిఆర్ఎస్, బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. దానిపై ఎవరు మాట్లాడినా కోర్టు ధిక్కరం కింద సుమోటోగా కేసులు నమోదు చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్, రోడ్డు విస్తరణలో ప్రజా ప్రయోజల కోసం విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఎంఎస్ 168 విడుదల చేసిందని, దాని ప్రకారం వాటిలో ఎవరిదైనా పట్ట భూమి ఉన్నా ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని నిబంధనలు చెబుతున్నాయన్నారు. పట్టా భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ఇచ్చే ఆలోచన ప్రభుత్వంలో ఉందని, అలాంటి వారికి గతంలో టీడీఆర్ బాండ్లు ఇచ్చారన్నారు. కొంత మంది ఆక్రమణ దారులు, భూ భకాసురుల ధన దాహానికి చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే.. తెలిసి తెలియక అందులోని ఇళ్ళను కొనుగోలు చేశారన్నారు. అలా నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇళ్ళు నిర్మించుకున్నవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.
మూసీ రివర్ బెడ్ లో ఇళ్ళు కోల్పోయిన వారికి ఏదైనా చిన్న తరహా పరిశ్రమలు కోల్పోతే.. వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఖబడ్దార్ అని హెచ్చరించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం కొద్దిపాటి వర్షానికే మోకాళ్ల లోతు నీళ్లతో ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల నుంచి శాశ్వత పరిష్కారం దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలోంచి వచ్చినదే హైడ్రా అన్నారు. ఇది ఆయన మానస పుత్రిక కార్యక్రమం అని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రాతో ఏ ఒక్కరికి నష్టం జరగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ప్రతిపక్ష నాయకుల వలలో చిక్కొద్దని ప్రజలను కోరారు. కొంతమంది అదే పనిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యాయ పరమైన చిక్కులను, అడ్డంకులను ఎదుర్కొంటూ ఎలాంటి తరమత భేదం లేకుండా భావితరాలకు సుందరమైన నగరాన్ని అందించాలని సీఎం కలలను నిజం చేస్తూ హైడ్రా ముందుకు సాగాలని కోరుకుంటున్నామన్నారు.