ఊర్లో ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా.. మీకు కష్టాలు తప్పవు!

ధరణి సమస్యలతో తల్లడిల్లుతున్న పల్లెలపై మరో పిడుగు పడింది. ఇప్పటిదాకా ఇంటి నిర్మాణాలు, అనుమతులపై ఏదో విధంగా సాగిపోయిన ప్రక్రియ కఠినంగా మారింది.

Update: 2022-09-29 03:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి సమస్యలతో తల్లడిల్లుతున్న పల్లెలపై మరో పిడుగు పడింది. ఇప్పటిదాకా ఇంటి నిర్మాణాలు, అనుమతులపై ఏదో విధంగా సాగిపోయిన ప్రక్రియ కఠినంగా మారింది. గ్రామాల్లో కూడా ఇక నుంచి చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కష్టాలే. మొన్నటి వరకు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్​ కలిసి ఇచ్చిన పర్మిషన్లు ఇప్పుడు సర్కారు ఉద్యోగుల చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో అనుమతుల పేరుతో అక్రమాలు మరింత పెరుగనున్నాయి. గ్రామ పంచాయతీల్లో టీఎస్​బీపాస్‌ను అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం సైలెంట్‌గా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26 నుంచే దీన్ని అమల్లో పెడుతున్నట్లు ఆదేశించింది. ప్రతి పంచాయతీ ఈ టీఎస్​బీపాస్ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తీయాలని వెల్లడించింది. కానీ, టీఎస్​బీపాస్‌కు చెల్లించే రుసుంలు, ఫీజులు పంచాయతీలకే ఉంటాయా.. ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయా అనేది క్లారిటీ ఇవ్వలేదు.

అమల్లోకి వచ్చినట్టే!

పట్టణాల్లో అమలులో ఉన్న టీఎస్-బీపాస్‌ ఇక నుంచి గ్రామాల్లో కూడా అమలవుతోంది. పంచాయతీల్లో లేఅవుట్ల అనుమతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న డీపీఎంఎస్‌, ఈ-పంచాయతీ విధానాన్ని టీఎస్ బీపాస్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించింది. దీంతో ఇక నుంచి గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టాలంటే బీపాస్‌ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26 నుంచే అమలు చేయాలని ఆదేశాలు వచ్చాయి.

అనుమతులు ఇలా..

గ్రామాల్లో భవన నిర్మాణాలకు అనుమతిచ్చేందుకు జీవో నెంబర్‌ 52ను జారీ చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకు గ్రామాల్లో భవన నిర్మాణానికి పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే సర్పంచ్‌, కార్యదర్శి పరిశీలించి ఈ-పంచాయతీ ద్వారా అనుమతి ఇచ్చేవారు. తాజా ఉత్తర్వుల ప్రకారం మీసేవా కేంద్రాల ద్వారా అన్ని రకాల ధ్రువ పత్రాలు, ఇంటి ప్లాను పొందుపరిచి టీఎస్‌ బీపాస్‌లో అప్‌లోడ్‌ చేయగానే సంబంధిత శాఖల అధికారులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. పంచాయతీ రాజ్‌, నీటిపారుదల, ఇంజినీరింగ్‌ శాఖల పరిశీలన అనంతరం సంబంధిత దరఖాస్తుకు 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది. అనుమతి లేని నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవి, ధృవపత్రాలు సక్రమంగా లేని కట్టడాలు ఉంటే వాటిని నోటీసు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారాన్ని పాలక వర్గాలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

వారసత్వ సవాళ్లు

టీఎస్‌ బీపాస్‌ విధానంలో దరఖాస్తు చేయాలంటే అన్ని ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం గ్రామకంఠం ఆధారంగా లేదా తాత, తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన స్థలాల్లో నిర్మాణాలు చేసుకుంటారు. దీని వల్ల దరఖాస్తుచేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొత్తగా తెచ్చిన చట్టంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ క్రమబద్ధీకరించాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట రుసుం చెల్లించిన స్థలాలకు, సరైన పన్నులు చెల్లించిన వారికే అనుమతులు ఇస్తారు. వారసత్వ భూముల్లో స్థలం అనువుగా ఉండటాన్ని బట్టి ఒక గది లేదా రెండు గదులు నిర్మాణం చేసుకుంటారు. ఇప్పటి వరకు ఇది చెల్లుబాటు అయింది. కానీ, ఇప్పుడు అలా చేయడం కుదరదు. దానికి అనుమతులు తప్పనిసరి. దానికో ప్లాన్​కూడా వేసుకోవాలి. ఇదంతా గ్రామాల్లో సాధ్యం కాదనే ఆరోపణలు విన్పిస్తున్నారు.

అనుమతులు కష్టమే

ఇక, మున్సిపాలిటీల్లో అయితే రిజిస్ట్రేషన్‌, బిల్డింగ్‌ ప్లాన్‌ డాక్యుమెంట్లు, ఫైర్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌ బీ, విద్యుత్‌ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌వోసీ) తప్పనిసరి. ఇక మీదట పంచాయతీల్లో ఇళ్లు కట్టుకోవాలన్నా ఈ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. గ్రామాల్లో చాలా వరకు భూములకు రిజిస్ట్రేషన్లు ఉండవు. నేటికి సాదాబైనామాలపైనే భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే ఇబ్బందులు తలెత్తనున్నాయి. టీఎస్‌ బీపాస్‌లో వచ్చే దరఖాస్తులను వివిధ శాఖల అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మండలానికి ఒకరిద్దరు ఆర్‌ఐలు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వారు పనిభారంతో సతమతమవుతున్నారు. సదరు అధికారులు టీఎస్‌ బీపాస్‌ దరఖాస్తులను సకాలంలో పరిశీలించడం అనుమానమే. అంతేకాకుండా ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులకు ఇప్పుడు గ్రామాల వారీగా క్లస్టర్లను విభజించనున్నారు. ఆ తర్వాత వారు వెరిఫై చేస్తేనే.. సంతకం పెట్టనున్నారు. 300 చదరపు గజాల లోపు స్థలానికి స్వీయ ధ్రువీకరణతో అనుమతి పొందవచ్చు. అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే వాటికి తప్పనిసరిగా డీటీడీసీ అనుమతి ఉండాలి. లేని పక్షంలో ఇంటి యజమానికి ధ్రువపత్రం జారీ చేయరు.

గ్రామ కార్యదర్శులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులకు ఈ విధానంలో పూర్తి స్థాయిలో అవగాహనతో ఉండాల్సిందే. ఇప్పటి వరకు కార్యదర్శి ఒకరే పరిశీలించగా కొత్త జీవో ప్రకారం టీఎస్‌బీపాస్‌ అమలులోకి వస్తే ఇతర అధికారులు కూడా పరిశీలిస్తారు. జీవో ప్రకారం ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్‌తో పాటు పంచాయతీరాజ్‌ అధికారులు పరిశీలించిన మీదట భవనాలకు అనుమతులను మంజూరు చేయనున్నారు. అన్ని గ్రామాల పరిధిలో మీసేవా కేంద్రాలు లేవు అవసరమైన వారు కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి. మున్సిపాలిటీల్లో ప్రస్తుతం కొన్ని రకాల డాక్యుమెంట్‌లు లేవని టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్నవాటిని తిరస్కరిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫీజులను వాపస్‌ ఇవ్వడంలేదు. రోజుల తరబడి తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే తప్ప అనుమతులు రావడంలేదు. టీఎస్‌ బీపాస్‌ ద్వారా గ్రామాల్లో భవన నిర్మాణాల అను మతులు ఇస్తే అవే సమస్యలు పునరావృతం కానున్నాయి.

టీఎస్ బీపాస్‌తో అనుమతులు సులభతరం అని ప్రభుత్వం చెప్తున్నా.. ఈ ప్రక్రియతో మరింత అవినీతి పెరుగుతుందని ఉద్యోగులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇప్పుడు నాలుగైదు శాఖల అధికారులు వెరిఫై చేయాల్సి ఉంటోంది. ఒక్కరు అడ్డు పెట్టినా.. ఇంటి అనుమతి పోయినట్టే. గ్రామాల్లో ఈ ప్రక్రియతో అధికారులకు కాసులు కురిపిస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి.

ఫీజులపై తేల్చలేదు

మరోవైపు గ్రామాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు, పలు రకాల ఫీజులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నిర్మాణ ఫీజును ఎంత వసూలు చేస్తారో కూడా తేల్చలేదు. అంతేకాకుండా ఈ ఫీజులు పంచాయతీలకు వెళ్తాయా.. మళ్లీ ప్రభుత్వ ఖజానాకు చేరుతాయా అనేది కూడా సందేహంగానే మారింది. వీటిపై తేల్చకుండానే ప్రభుత్వం పల్లెల్లో బీపాస్ అమలుకు దిగింది.

Tags:    

Similar News