కవిత పిటిషన్‌పై గందరగోళం.. ఈడీ నెక్ట్స్ ఎంక్వయిరీ నోటీసులపై డైలమా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈ నెల 14న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈ నెల 14న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వస్తుందని ఆమె తరపు న్యాయవాదులు భావించారు. ఈ నెల 24న విచారణ ఉంటుందన్న హామీ లభించింది. కానీ చివరకు అది మూడు రోజులు ఆలస్యంగా ఈ నెల 27న విచారణకు రానున్నది. చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదులుగా జస్టిస్ అజయ్ కుమార్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనున్నది.
ప్రేయర్ సెక్షన్‌లో అస్పష్టత
తొలుత వచ్చిన షెడ్యూలు ప్రకారం ఈ పిటిషన్ ఈ నెల 24న విచారణకు వస్తుందని కవిత తరపు న్యాయవాదులు భావించారు. ఒక రోజు ముందు ఆమె తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో గతంలో సమర్పించిన పిటిషన్‌ను పరిశీలించినప్పుడు కొన్ని పొరపాట్లు ఉన్నట్లు గుర్తించి న్యాయవాదికి తెలియజేశారు. పిటిషన్‌లోని ప్రేయర్ సెక్షన్‌లోనూ అస్పష్టత ఉన్నట్లు తెలియజేశారు.
వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయవాదులు తగిన సవరణలు చేశారు. తొలుత దాఖలు చేసిన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు తోడు మరికొన్ని ఉదాహరణలను ప్రస్తావించి వాటికి అనుగుణంగా డాక్యుమెంట్లు, ఎవిడెన్సులను జోడించినట్లు తెలిసింది. ఎంక్వయిరీ కోసం ఈడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని, మహిళగా ఆఫీసుకు పిలిపించవద్దని, ఇంట్లోనే విచారించాలని, సూర్యాస్తమం తర్వాత ఎంక్వయిరీ ఉండకూడదని ఇలా అనేక అంశాలను ప్రేయర్ పార్టులో కవిత పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ప్రేయర్‌లో మార్పులు చేయడంతోపాటు కొన్ని కొత్త అంశాలను కూడా చేర్చినట్లు తెలిసింది.
ఈడీ కెవియట్ పిటిషన్‌పై కూడా..
కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తమను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ ఈడీ సైతం కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏకకాలంలో ఈ రెండు పిటిషన్లపై విచారణ జరగనున్నది. ప్రస్తుతం కవితను ఈడీ విచారిస్తూ ఉన్నందున సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అటువైపు నుంచి ఎలాంటి వాదనలు వస్తాయో కవిత ఒక అంచనాకు వచ్చారు. వీటినే తన తండ్రి కేసీఆర్‌తోనూ పంచుకున్నట్లు తెలిసింది. ఈడీ దర్యాప్తు తీరును విశ్లేషించుకున్న కవిత ఒక సీనియర్ లాయర్‌ను పెట్టుకుని ఈడీ వాదనలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలనే భావనలో ఉన్నారు.
సుప్రీం ఉత్తర్వులపై ఆసక్తి
సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చే లోపే ఈడీ నుంచి మరోసారి ఎంక్వయిరీకి నోటీసులు వస్తాయేమోననే ఆందోళన బీఆర్ఎస్, జాగృతి కార్యకర్తల్లో నెలకొన్నది. చివరిసారిగా ఆమెను ఈ నెల 21న విచారించారు. మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పిన ఈడీ అధికారులు తేదీని మెయిల్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. మూడు రోజులు కావస్తున్నా ఈడీ నుంచి తదుపరి విచారణకు సంబంధించిన నోటీసులపై ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.
కవిత తన పిటిషన్‌లోని ప్రేయర్‌లో కొత్తగా చేర్చిన అంశాలు ఏమిటనేది బహిర్గతం కాలేదు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కవిత తరఫున, ఈడీ తరఫున జరగబోయే వాదనలపైనే ఆసక్తి నెలకొన్నది. సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ఈడీ ఎంక్వయిరీ నుంచి కవితకు రిలీఫ్ లభిస్తుందా? కవిత లేవనెత్తిన వాదనలకు ఈడీ తరఫున కౌంటర్ ఎలా ఉంటుంది? దానిపై సుప్రీంకోర్టు ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తుంది? అనే వాటిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి: రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్పీఎస్సీ.. అనర్హులకు ప్రియారిటీ?