ధరణిపై CM రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ధరణిపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోపాలు ఉన్నట్లు ధరణి కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: ధరణిపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోపాలు ఉన్నట్లు ధరణి కమిటీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ధరణి కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకొని సమస్యల పరిష్కారానికి విధివిధానాలు రూపొందించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో 2.45 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలో లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. తుది నివేదిక తర్వాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకు వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.