Kishan Reddy: తెలంగాణ హోంమంత్రి ఎక్కడ..?
రాష్ట్రానికి హోంమంత్రి లేని పాలన కొనసాగుతోందని, తెలంగాణ హోమంత్రి ఎక్కడ.. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి హోంమంత్రి లేని పాలన కొనసాగుతోందని, తెలంగాణ హోమంత్రి ఎక్కడ.. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు? హైదరాబాద్‌లో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఇటీవల సంగారెడ్డి జిల్లాలో నడిరోడ్డుపై తల్లీకొడుకులను నరికి చంపారని, హైదరాబాద్‌లో హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఒక ప్రకటనలో మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఫైరయ్యారు. మియాపూర్ అంజయ్యనగర్ కాలనీకి చెందిన బాలిక ఈనెల 10వ తేదీన మిస్ అయిందని, సోమవారం తుక్కుగూడలో శవమై కనిపించిందన్నారు. యువతి తల్లిదండ్రులు మిస్సింగ్కంప్లైంట్ ఇచ్చి వారం దాటినా.. పోలీసులు కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలికను అత్యాచారం చేసి ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో పడేశారని, పోలీసుల వైఫల్యం వల్లే తమ కూతురు బలైందని బాధిత తల్లిదండ్రులు విలపిస్తున్నారన్నారు.
ఇంతమంది పోలీసులు, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండి కూడా ఒక బాలికను కాపాడలేకపోయాయని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని, బాధితుల పక్షాన కొట్లాడుతున్న లీడర్లను అరెస్ట్ చేయిస్తున్న రేవంత్ రెడ్డికి.. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు పాలన చేతకావడం లేదని, శాంతి భద్రతల పరిరక్షణపై పట్టింపు లేదన్నారు. ఇదిలా ఉండగా లగచర్ల వెళ్తున్న బీజేపీ ఎంపీలు డీకే అరుణను, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఇందిరమ్మ రాజ్యమంటే.. ఆడబిడ్డలపై దాడి చేయడమేనా అని ఆయన ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల బాధలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తే.. ప్రజలు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.