అనవసర గర్భసంచి తొలగింపులను ఆపలేమా?
అమెరికాలో 'గర్భసంచి తొలగింపు' ఆపరేషన్‌లు ప్రతి 10,000 మందిలో 55 మందికి జరిగితే, ఇంగ్లండ్ లో కేవలం 20 మందికి మాత్రమే జరిగాయి. కానీ ఎంతో
అమెరికాలో 'గర్భసంచి తొలగింపు' ఆపరేషన్‌లు ప్రతి 10,000 మందిలో 55 మందికి జరిగితే, ఇంగ్లండ్ లో కేవలం 20 మందికి మాత్రమే జరిగాయి. కానీ ఎంతో అభివృద్ధి చెందినవిగా, ఘనంగా చెప్పు కుంటున్న మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 10,000 మందిలో 920 మందికి ఈ ఆపరేషన్‌లు జరగడం దారుణం. అది కూడా స్త్రీలకు 29 ఏళ్ల వయస్సులోనే ఈ ఆపరేషన్లు చేస్తున్నారంటే, స్త్రీల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
సమాజంలో స్త్రీల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయబడుతోంది అనేది ఒక వాస్తవం. సమాజంలో స్త్రీ ఆరోగ్యానికి ఇచ్చే విలువ, ఆ స్త్రీకి సమాజం ఇచ్చే ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల తక్కువగా చూడబడే స్త్రీ ఆరోగ్యం విలువ కూడా తక్కువగానే ఉంటుంది. ఒకప్పుడు బాగా పనిచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సైతం ఇప్పుడు నిర్వీర్యమై పోయాయి. ఈ రోజున స్త్రీల శరీరాలు ప్రయోగ శాలలుగా మార్చబడ్డాయి.
ఈ ఘోరాన్ని ఆపాలనే చిత్తశుద్ధితో..
ఆధునిక వైద్యం వాణిజ్యంగా మారిపోయిన తర్వాత ప్రజలకు వైద్యం అనేది అందని ద్రాక్ష పండే అయింది. ప్రభుత్వాసుపత్రులు నామమాత్రమైపోయిన ఈ సందర్భంలో ప్రభుత్వాలు స్త్రీ ఆరోగ్యానికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నాయో పరిశీలిస్తే, ఆశ్చర్యకరమైన వాస్తవాలు కనబడతాయి. వైద్యులు స్త్రీల జీవితాలతో, ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ సందర్భంలో డా.సామవేదం వెంకట కామేశ్వరి, సూర్యప్రకాశ్ దంపతులు 2001లో మెదక్ జల్లా సదాశివపేటలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నప్పుడు మునిపల్లె మండలంలోని దాదాపు 20 గ్రామాల్లో 171 మందికి గర్భసంచిలు అతి పిన్న వయస్సులోనే తొలగించారని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘోరమైన అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలనే పట్టుదలతో చిత్తశుద్ధితో LIFE HRG సంస్థ ద్వారా మెడికల్ ఎథిక్స్ విభాగంలో దీన్ని ఒక కేసు కింద తీసుకుని (2009-12) మధ్య కాలంలో ఈ అంశాన్ని చర్చించింది.
ఈ సమస్యపై పుస్తకం..
“గర్భసంచిని కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం “అనే పుస్తకాన్ని మొదట 2017 సంవత్సరంలో ప్రచురించారు. తెలంగాణా ప్రభుత్వ సహకారంతో 2018 సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, మహిళా సమాఖ్య సభ్యులకు, 81 గ్రామాల్లో 16000 మందికి పైగా స్త్రీలకు పెద్ద ఎత్తున గర్భసంచి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అంతేగాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక పాఠశాలల్లో, కాలేజీలలో విద్యార్ధినులకు గర్భసంచి ప్రాధాన్యత గూర్చి వివరించారు. ఇక జాతీయ స్థాయిలో దేశంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.ప్రాదివాలా ధర్మాసనం 2023 ఏప్రిల్ 5న గర్భసంచి తొలగింపు ఆపరేషన్లను కట్టడి చేస్తూ 3 నెలల కాల వ్యవధిలో రాష్ట్ర ప్రభు త్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయినా ఇంతవరకు క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు అమల్లోకి రాలేదు. వీరి కృషి ఫలితంగానే ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకాలలో, అప్పటివరకు విచ్చలవిడిగా అమలవుతున్న అనవసర గర్భసంచిల ఆపరేషన్లను గతంలో 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది.
నిర్ణయాధికారం స్త్రీలకే వుండాలి
ఈరోజున వైద్యరంగం లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నప్పటికి, ఆధునిక వైద్య వ్యవస్థ, పునరుత్పత్తి విషయంలోనూ, స్త్రీల ఆరోగ్య విషయం లోనూ నిర్లక్ష్యం చేయబడుతోంది. సాధారణంగా వారు ఎదుర్కొనే తెల్లబట్ట, దురద, దుర్వాసన, పొత్తి కడుపు నెప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం లాంటి కారణాలతో స్త్రీలు గర్భసంచిని తొలగించుకుంటున్నారు. దీనివల్ల స్త్రీల జీవితాలు మరింత దుర్భ రంగా మారుతున్నాయి దాన్ని ఎవరు సరిచేస్తారు? తొలగించిన అవయవాల పనులను అవి స్రవించే హోర్మోన్లలను ఎలా భర్తీ చేస్తారు? అయితే, వీటన్నిటి వెనక సామాజిక, ఆర్థిక సాంస్కృతిక దృక్కోణాలు ఉన్నాయి. స్త్రీకి తన శరీరం మీద, తన ఆరోగ్యం పట్ల నిర్ణయాధికారం లేదు. అందువల్లనే స్త్రీల ఆరోగ్యంపై పురషుడి పెత్తనం, సమాజం అదుపు ఉంటాయి. స్త్రీ పిల్లల్ని కనాలా!వద్దా! కంటే ఎంతమందిని కనాలి? ఎవరిని కనాలి? (ఆడ,మగ) అనే విషయాలలో నిర్ణయం పురుషుడిదే. స్త్రీల ఆరోగ్యం గురించి పట్టించుకోని ఈ ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలు స్త్రీలు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో శాసిస్తుంది. కాబట్టి వ్యవస్థీకృతం చేయబడ్డ ఈ సమాజంలోనే స్త్రీ మనుగడ సాగించాల్సి వస్తోంది. దానికి తోడు స్త్రీల అవగాహన లేమి సామాజిక, ఆర్థిక పరిస్థితులు కారణాలుగా ఉంటున్నాయి'. వెనకబడిన సామాజిక వర్గాల వారి పరిస్థితి కూడా ఇందుకు దోహదమవుతోంది.
స్త్రీల అరోగ్యం ఒక రాజకీయ సమస్య!
స్త్రీలు తమ ఆరోగ్యం గురించి, గర్భసంచిలను అనవసరంగా తొలగించటం లాంటి విషయాల గురించి, ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో స్త్రీలు పోటీ చేయ డం ద్వారా రాజకీయంగా కూడా సవా ల్ చేయవచ్చు. ఈ పనిని నేడు ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీలు పట్టించుకునే స్థితిలో లేవు. డాక్టర్.కామేశ్వరి లాంటి ఔత్సాహికులైన వైద్యులు వ్యక్తిగత స్థాయిలో చిన్న సంస్థ ద్వారా చేసే ప్రయత్నానికి మహళలు, స్త్రీల సమస్యల కోసం పనిచేసే మహిళా సంఘాలు ముందుకు వచ్చి తమ తోడ్పాటును అందించటం చాలా అవసరం. ఈనాడు లాటిన్ అమెరికా, క్యూబా లాంటి దేశాలు ఇంటిపని, పిల్లల పెంపకం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందో ళన చేపడుతున్నాయి. అబార్షన్ హక్కు స్త్రీలకు ఉండాలని, పిల్లలు కనా లా!వద్దా! అనేది స్త్రీలే నిర్ణయించుకోవాలని పోరాడుతున్నా యి. అందువల్ల స్త్రీల సమస్యలపై జరిగే ఈ పోరా టాల నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రాజకీయ సమస్యగా గుర్తించి స్త్రీల హక్కులకై పోరాడడం ద్వారా నే స్త్రీల ఆరోగ్య హక్కును సాధించుకోవాల్సి వుంది.
- రాజ్యలక్ష్మి పొన్నపల్లి,
94939 75304