ట్రాఫిక్ రూల్స్ పాటించాలి!

శాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చిన ఇంటర్‌నెట్ విప్లవాత్మక మార్పుల వల్ల ప్రపంచపు అన్ని దిక్కులా "వేగం" సంతరించుకుంది. అదే నేటి యువతకు తారక

Update: 2024-11-19 00:30 GMT

శాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చిన ఇంటర్‌నెట్ విప్లవాత్మక మార్పుల వల్ల ప్రపంచపు అన్ని దిక్కులా "వేగం" సంతరించుకుంది. అదే నేటి యువతకు తారక మంత్రం అయ్యింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీస్‌కు వెళ్లాలనో, కాలేజ్‌కు వెళ్లాలనో, మీటింగ్‌కు హాజరు కావాలనో గమ్యాన్ని తొందరగా చేరుకోవాలనే తాపత్రయంలో సరిగ్గా లేని రహాదారుల గుండా వాహనాలను అదుపు చేయలేని వేగంతో నడుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో హెల్మెట్ ధరించకపోవటం, సీటు బెల్టులు వాడకపోవడం వంటి తప్పిదాల వల్ల ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే, ఈ ప్రమాదాల్లో ఏమాత్రం సంబం ధం లేని సామాన్య ప్రజలు విగత జీవులుగా మిగులుతున్నారు.

ఈ ప్రమాదాలను అరికట్టడానికి..

"వేగం కంటే ప్రాణం ముఖ్యం", "హెల్మెట్ ధరిద్దాం రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం" వంటి కొటేషన్లు వాల్‌పై రాతలుగా కాకుండా మన బాధ్యత తాలుకూ ప్రతిబింబాలైతే రోడ్లపై నెత్తుటి మరకలు కనిపించవు. రోడ్లపై దారుణమైన ప్రమా దాలు జరగడానికి అదుపు చేయ లేని వేగంతో వాహనంను నడపడంతో పాటు, రద్దీ ప్రదేశాల్లో రోడ్ల విస్తరణ లేకపోవడం, పార్కింగ్‌కు స్థలం కేటాయించకపోవడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనను పెంచే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించకపోవడం, రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు, నిర్వహణ సరిగా లేకపోవడం వంటి తదితర అంశాలను కొన్ని ప్రమాదాలకు కారణాలుగా మనం చెప్పవచ్చు. మద్యం, డ్రగ్స్ మత్తు లో ప్రయాణం తోటి ప్రయాణికులకు కూడా ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. ట్రాఫిక్, పోలీసు వ్యవస్థ సిబ్బంది చాలా వరకు రోడ్డుప్రమాదాలను అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా మెరుగైన వ్యవస్థలు, ప్రమాదాల నివారణ కార్యక్రమాలు అవసరం. ప్రభుత్వాలు, ప్రజలు పరస్పర సహాకారంతో ఈ ప్రమాదాలను అరికట్టాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రోడ్డు ప్రమాదాల నివారణపై ఎన్నో వినూత్న అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. పిల్లలకు వాహనాలను ఇచ్చే సందర్భంలో కూడా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మంచి రవాణా మార్గాలే..

ఇక ఏదైనా ప్రమాదం జరిగితే సామాన్య ప్రజల స్పందన తమ ఫోన్ కెమెరా ద్వారా రికార్డ్ చేయడంలోనే బిజీ అవుతోంది తప్ప తక్షణ సాయం విషయంలో మానవత్వం ప్రదర్శించడంలో కనిపించడంలేదు. ఇలాంటి సందర్భాల్లో బాధితులను ఆదు కున్న వ్యక్తులకు కూడా పోలీసులు, డాక్టర్లు సతాయించకుండా సహకరించాలి. సామాజికంగా తోటి మనుషులకు సాయపడే వ్యక్తులను ప్రభుత్వాలు, మీడియా వారు, స్వచ్ఛంద సంస్థలు అభినందించాలి. గ్రామాలే మన దేశానికి పట్టు కొమ్మలు అన్న మహాత్ముడి మాటలను మనం మరచిపోవడం ఆందోళనకరం. మంచి రవాణా మార్గాలే ఆధునికంగా మనం ఆర్థికంగా, సామాజికంగా, నాగరికంగా ఎదగడానికి దారులుగా నిలుస్తాయి. నేడు అభివృద్ధి చెం దిన దేశాలను మనం గమనించినట్లైతే ఈ విషయం మనకు బోధ పడుతుంది. అందుకే ప్రభుత్వాలు ప్రతిదీ రాజకీయ కోణంలో కాకుం డా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఆలోచించి రోడ్డు మరమ్మత్తులను పూర్తిచేయాలి. అలాగే మనమంతా బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Tags:    

Similar News