CM Revanth Reddy: కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ ఛాన్స్ తెలంగాణకు ఇవ్వండి: రేవంత్ రెడ్డి

కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భేటీ అయ్యారు.

Update: 2024-08-23 13:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ, అంత‌ర్జాతీయ క్రీడ‌లు నిర్వహణకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు తెలంగాణ‌లో ఉన్నాయ‌ని అందువల్ల భవిష్యత్ లో ఒలింపిక్స్‌, ఏషియన్ గేమ్స్‌, కామ‌న్‌వెల్త్ గేమ్స్ తెలంగాణ‌లో నిర్వహించే అవ‌కాశం ఇప్పించాల‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కేంద్ర క్రీడా, యువ‌జ‌న వ్యవహారాల శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. 2002లో నేషనల్ గేమ్స్, 2003లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్, 2007లో ప్రపంచ మిలటరీ గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నగరంలో స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, అంత‌ర్జాతీయ‌ ప్రమాణాలతో కూడిన ఈత కొల‌నులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథ‌టిక్ అథ్లెటిక్ ట్రాక్స్, ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌, స్కేటింగ్ ట్రాక్స్‌, వాట‌ర్ స్పోర్ట్స్‌, ఇత‌ర క్రీడ‌ల‌కు వ‌స‌తులు ఉన్నాయ‌ని అందువల్ల భవిష్యత్ లో జరగబోయే కీలకమైన గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని కోరారు. ముఖ్యంగా 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహించే ఛాన్స్ కల్పించాలన్నారు.

స్పోర్ట్స్ యూనివర్సిటీకి నిధులివ్వండి:

తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించిన అన్ని రకాల శిక్షణ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామని అందువల్ల ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి కేంద్రం తరపున అవసరమైన ఆర్థిక సహాయం అందజేయాలని మంత్రిని కోరారు. రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద విడుదల చేసే నిధుల మొత్తాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీఎంసీ బాలయోగి స్టేడియం, షూటింగ్ రేంజ్, ఎల్బీ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం అప్ గ్రేడేషన్ కు సమర్పించిన డీపీఆర్ లను ఆమోదించాలని కోరారు.


Similar News