అనర్హత భయంతోనే దాడులను ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద

Update: 2024-09-16 08:26 GMT

దిశ వెబ్ డెస్క్ : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులను ప్రోత్సహిస్తున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హై కోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని, పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలు అభద్రతాభావంతో ఉన్నారన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరామని, మాకు సమాధానం చెప్పలేక దాడుల రాజకీయంతో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డైవర్షన్ సాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిన్న తన దీన స్థితిని బయటపెట్టుకుని నిన్న మా వాళ్లే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని చెప్పారని, ఇది రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అరికేపూడి గాంధీని సీఎం రేవంత్ రెడ్డినే ఉసికొల్పారని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రేవంత్ రెడ్డి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. రుణమాఫీ విషయంలో సీఎం అబద్దాలు చెప్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో వరద భాదితుల వద్దకు బీఆర్ఎస్ నాయకుల బృందం వెళ్తే గూండాలను పంపి మాపై దాడులు చేయించారని, కొల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి అనే నాయకుడిని హత్య చేశారని వివేకానంద ఆరోపించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆటవిక పాలన చేస్తున్నారని, రేవంత్ రెడ్డి దాడి వ్యాఖ్యలపై డీజీపీ, హోం సెక్రటరీ స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోతున్నారని, రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చినప్పుడల్లా గొడవ జరుగుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై త్వరలో డీజీపీ,హోం సెక్రటరీ, గవర్నర్ ను కలుస్తామన్నారు. మాకు తెలంగాణలో న్యాయం జరగకపోతే రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో పరిస్థితులపై వివరిస్తామని చెప్పారు.

ఎమ్మెల్యే డాక్టర్ కె. సంజయ్ కుమార్ మాట్లాడుతూ మేము రేవంత్ రెడ్డిని, సీఎం పదవిని గౌరవిస్తామని, రేవంత్ రెడ్డి తన దిగజారుడు మాటలు బంద్ చేయాలన్నారు. రేవంత్ రెడ్డి పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి హైదరాబాద్ రాగానే గాంధీ  కాంగ్రెస్ ఎమ్మెల్యే అని అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారని, రేవంత్ రెడ్డి తన స్థాయిని నిలబెట్టుకోవాలని, రాజకీయం అంటే తిట్టాలి, కొట్టాలి అనే విధంగా తయారు అయిందని, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామని బాధ అవుతుందని వాపోయారు. కేసీఆర్ అంత గొప్పోడు రేవంత్ రెడ్డి ఎన్నటికీ కాలేడన్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎటు కాకుండా పోయారని, ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెబుతుంటే.. మంత్రులు వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని అంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, అరికేపూడి గాంధీ తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి దానం నాగేందర్ ,అరికేపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 


Similar News