టీపీసీసీ చీఫ్ ఎన్నిక, కేబినెట్ విస్తరణపై రేవంత్ క్లారిటీ.. ఒక్క మాటతో తేల్చేసిన CM..!
కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎన్నిక తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్ కేబినెట్‌లో మరో ఆరు మంత్రి బెర్తులు
దిశ, వెబ్‌డెస్క్: కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎన్నిక తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్ కేబినెట్‌లో మరో ఆరు మంత్రి బెర్తులు ఖాళీ ఉంటడంతో.. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనుందని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం సైతం ఖరారు అయ్యిందని.. జూలై 4వ తేదీన నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనితో పాటుగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవి కాలం ముగియనుండటంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మరొకరికి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. రేవంత్ ప్రస్తుతం సీఎంగా ఉండటంతో స్టేట్ చీఫ్ పగ్గాలు ఇతరులకు ఇవ్వాలని.. ఈ మేరకు ఏఐసీసీ ఆశావహులను ఫిల్టర్ చేసే పనిలో నిమగ్నమైంది.
అయితే, కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు నూతన పీసీసీ చీఫ్ ఎంపికను సైతం హై కమాండ్ పూర్తి చేసిందని, ఈ రెండు అంశాలకు చెందిన అధికారిక ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లో ఏఐసీసీ నుండి వెలువడుతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసింది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై ప్రస్తుత టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. గురువారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ విస్తరణ, పీసీసీ నియామకంపై ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
బాల్ ఇప్పుడు ఏఐసీసీ కోర్టులో ఉందని.. ఎందుకు ఆలస్యం అవుతుందనేది అధిష్టానం చెప్పాలని రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎన్నికపై తన అభిప్రాయాలను హై కమాండ్‌కు షేర్ చేశానని వెల్లడించారు. కాగా, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎన్నికపై హై కమాండ్‌తో తుది చర్చలు జరిపిన అనంతరం.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రచారం జరిగింది. అయితే, రాహుల్, ఖర్గేలతో జరిగిన భేటీలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం లాస్ట్ మినిట్‌లో కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎన్నికను ఏఐసీసీ తాత్కాలికంగా వాయిదా వేసింది. వారం పది రోజుల తర్వాత మరోసారి స్టేట్ లీడర్స్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హై కమాండ్ నిర్ణయించింది.