కూకట్‌పల్లిలో ఇల్లు కట్టుకుంటే మాముళ్లు ఇవ్వాల్సిందే..?.. ఎవరీ అక్రమార్కుడు..!

కూకట్‌పల్లిలో ఇల్లు కట్టుకోవాలంటే ఆయనకు ముడుపు చెల్లించుకోవాల్సిందేనంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Update: 2024-07-07 02:57 GMT

దిశ, కూకట్‌పల్లి: మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలో ఉండ లేరు.. నిర్మాణం చేపట్టాలంటే లక్షల్లో ముడుపులు చెల్లించకుంటే ఇండ్లు నిర్మించుకోలేరు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయండి లేదా మరమ్మతు చేసుకోండి అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేస్తుంటే అప్పు సొప్పు చేసుకొని పునర్​ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తుంటే నాయకులు మామూళ్లలు ఇవ్వకపోతే కట్టుకోనివ్వమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఎల్‌ఐజీ నివాసితుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా తయారైంది.

పెద్ద పెద్దవాళ్లతో తనకు సంబంధాలున్నాయని.. ఇండ్లు కట్టుకోవాలంటే తనకు మామూలు ఇవ్వాల్సిందేనని ఓ పార్టీ నాయకుడు నిర్మాణదారులను, బిల్డర్లను బెదిరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వకపోతే జీహెచ్‌ఎంసీ అధికారులను పంపించి నిర్మాణాలను కూల్చి వేయాస్తానంటూ అల్టిమేటం జారీ చేస్తున్నాడు. నాయకుడి ఇబ్బందులు తట్టుకోలేక బాధితులు కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జి బండి ‌రమేష్‌‌తో పాటు బీజేపీ నాయకులను ఆశ్రయించారు. కేపీహెచ్‌బీ కాలనీలో ప్రస్తుతం ఎల్‌ఐజీ ఇండ్ల సముదాయంలో నివసించే వారు సదరు నాయకుడి పేరు చెబితే భయబ్రాంతులకు గురవుతున్నారు.

పేద, దిగువ, మధ్య తరగతి, ప్రజలకు ఆవాసం కల్పించే విధంగా ప్రభుత్వం ఎల్‌ఐజీ (లో ఇన్​కమ్​ గ్రూప్​), ఎంఐజీ (మిడిల్​ ఇన్​కం​గ్రూప్​), హెచ్​ఐజీ (హై ఇన్​కమ్​ గ్రూప్​)లుగా విభజించి ఇండ్లను కేటాయించింది. ఈ ఇండ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ ప్రతి వర్షాకాలంలో ఇండ్లను పరిశీలించి శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లకు మరమ్మతులు చేయించుకోవాలి. లేకపోతే ఇండ్లలో నివాసం ఉండరాదంటూ ఇండ్ల ముందు స్టికరింగ్​ చేయడం, ఇండ్ల యజమానులకు నోటీసులు అందిస్తున్నారు.

ఇది లా ఉండగా కేపీహెచ్‌బీ కాలనీ మూడో ఫేజ్​ ఎల్​ఐజీ 121కు చెందిన ఆరుగురు యజమానులు తమ ఇండ్లను కూల్చుకొని తిరిగి నిర్మాణం చేపడుతుండగా కేపీహెచ్​బీకాలనీకి చెందిన కాంగ్రెస్​ నాయకుడు తనకు తాను సీఎం సోదరుడి తాలుకాగా చెప్పుకుంటూ ఒక్కో ఫ్లాట్ యజమాని 25 వేల చొప్పున 6 గురు రూ. 1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. అంత ఇచ్చుకోలేమని ప్రాధేయ పడితే రూ. 5 వేల డిస్కౌంట్​ ఇస్తున్నా.. రూ. 1.2 లక్షల ఇవ్వండి లేకపోతే జీహెచ్​ఎంసీ అధికారులను పంపి కూల్చి వేయిస్తానని హుకూం జారీ చేశాడు.


Similar News