దసరా నాటికి ‘ఇందిరమ్మ’ ఇళ్లు!

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది.

Update: 2024-07-07 02:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్రంలో పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రస్తుతం పథకం అమలు కోసం అర్హుల ఎంపిక ప్రక్రియ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం అధికారులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రభుత్వాల విధి విధానాలను అధ్యయనం చేయనున్నారు. సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇక సొంత జాగా లేని వారికి ఇంటి స్థలం తో పాటు ఆర్థిక సాయం రూ.5లక్షలు అందజేయనున్నారు.

82.82లక్షల దరఖాస్తులు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాపాలన పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ప్రతి సెగ్మెంట్ కి 3,500 ఇళ్ల చొప్పున ఏడాదికి 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.ప్రజాపాలనలో మొత్తం 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను గుర్తించటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.పేదరికంలో ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, దరఖాస్తులు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమత ను గుర్తించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల మాదిరిగా కాకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఇప్పటికే ఆదేశించారు.

ఇతర రాష్ట్రాల్లో అధికారుల పర్యవేక్షణ..

ఇళ్ల అర్హులను గుర్తించే అంశాలపై ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం ఫోకస్ పెట్టారు.అందుకోసం ఇతర రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అనుసరించిన విధి విధానాలను అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు.ఆ మేరకు ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను ఎంచుకున్నారు.గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్‌ను నియమితులు కాగా..ఆయన ఆధ్వర్యంలోని బృందం ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేయనుంది.ఇక ఈ ఏడాది దసరా పండుగ నాటికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.ఈ పథకం అమలు కోసం ఈఏడాది బడ్జెట్‌లో సుమారు రూ.ఏడున్నర వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని తెలిసింది.


Similar News