గద్వాల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆయనేనా..?

గద్వాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ...

Update: 2024-07-07 03:23 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: గద్వాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు నెలలుగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, ఆమె అనుచరులు కృష్ణమోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో బండ్ల చేరిక కొంత ఆలస్యం అవుతూ వచ్చింది. రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుండడంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి దీపామున్షి, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మరోవైపు మొదటినుంచి రాజకీయ ప్రత్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడంతో పాటు.. పెద్ద ఎత్తున గాంధీభవన్ వద్ద మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య అనుచరులు ఆందోళన కూడా చేపట్టారు. కానీ అధిష్టానం రాష్ట్రంలో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు చేర్చుకుంటున్నామే తప్ప.. నియోజకవర్గంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టడం తమ ఉద్దేశం కాదని సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు చెప్పినట్లు సమాచారం. సరిత తిరుపతయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని, ఆమెకు వీలైనంత త్వరలోనే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో పాటు, రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను ఇస్తామని.. జిల్లా పరిషత్ ఎన్నికలలో మళ్లీ పోటీ చేయించి చైర్ పర్సన్ గా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంపై బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్న కారణంగానే సరిత తిరుపతయ్య పార్టీ మారడం.. కృష్ణమోహన్ రెడ్డిపై పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగిన విషయం పాఠకులకు విధితమే. ఇప్పుడు మళ్లీ వారు ఒకే పార్టీలో కొనసాగడం అంత సులభమేం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్‌లోకి గొంగళ్ల రంజిత్ బాబు

నడిగడ్డన బీఆర్ఎస్ బలోపేతంగా ఉంది. ఈ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోగా.. గద్వాల జిల్లాలో అలంపూర్, గద్వాల నియోజకవర్గాలలో మాత్రమే పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు గద్వాల నియోజకవర్గ నుంచి గెలుపొందిన కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారడంతో.. బీఆర్ఎస్ బరువు బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారనే చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, షాట్స్ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ లేదా, గట్టు మండలంలో బలమైన బీసీ నేతగా ఉన్న హనుమంతు నాయుడుకు బాధ్యతలు అప్పగించే విషయంలో పార్టీ అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తనకు సముచిత స్థానం కల్పిస్తే బీఆర్ఎస్‌లో చేరేందుకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్ బాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన ఉద్దేశాన్ని మధ్యవర్తుల ద్వారా రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్, బీ ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమాచారం పంపినట్లు తెలిసింది. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారడంతో జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అన్న చర్చలు మొదలయ్యాయి. మొత్తంపై నడిగడ్డ రాజకీయాలు వాడీ వేడీగా సాగుతూ రాష్ట్రవ్యాప్త చర్చనీయాశం అయ్యాయి.


Similar News