తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది: సీఎం కేసీఆర్
‘మొన్న నేను మహారాష్ట్రకు వెళితే తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారని, దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంతోంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
దిశ, ప్రతినిధి నిర్మల్: ‘మొన్న నేను మహారాష్ట్రకు వెళితే తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారని, దేశమంతా తెలంగాణ మోడల్ కోరుకుంతోంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయాల కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం అనంతరం జరిగిన జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో మాట్లాడారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఇది మీ అందరి కృషితోనే జరిగిందని అధికారులకు సీఎం కితాబునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నో అద్భుతాలు సాధించిందని తాగునీరు, విద్యుత్, సాగునీరు, వ్యవసాయం వంటి అనేక కార్యక్రమాల్లో దేశంలోనే గణనీయమైన వృద్ధి సాధించిందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రాకె గ్రామం సాధించిన అభివృద్ధి దేశాన్ని ఆకర్షించడం గొప్ప విషయం అన్నారు.
తలసరి ఆదాయంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అధిగమించి అన్ని రాష్ట్రాల కన్నా ముందు వరసలో ఉన్నామని చెప్పారు. ఇదంతా ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో సాధించగలిగామన్నారు. ఇంకా సమాజంలో పేదరికం ఉందని దళిత, నిమ్న జాతులు సమాన స్థాయికి ఎదిగేదాకా అన్ని రకాలుగా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళితులు, గిరిజన బిడ్డలు సమాన స్థాయికి తీసుకురావడం మనందరి బాధ్యత అన్నారు. మళ్లీ ఎన్నికల తర్వాత ప్రతి తాలూకాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని, ఇంకా అనేక కొత్త కార్యక్రమాలు తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రం నుంచి పేదరికం పారదోలేందుకు అధికారులు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 24 నుంచి గిరిజనులకు సంబంధించి పోడు భూములకు పట్టాలు అందజేయన్నామని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్మల్ కలెక్టర్ తనతో చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఏడాదే పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే గాక వారికి రైతుబంధు అమలు చేస్తామని స్పష్టం చేశారు. పోడు భూములు కలిగి ఉన్న రైతులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాలు వెంటనే తెరవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి, రేఖా నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.