సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి: MLA ఈటల డిమాండ్
యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బోర్డ్ విషయంలో ఇలాంటివి జరుగుతాయనే ముందుచూపుతోనే గవర్నర్ యూనివర్సిటీల బిల్లును ఆపారని, అంతే తప్పా వ్యక్తిగతంగా ఏమీ లేదని, ఈ విషయంలో గవర్నర్
దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బోర్డ్ విషయంలో ఇలాంటివి జరుగుతాయనే ముందుచూపుతోనే గవర్నర్ యూనివర్సిటీల బిల్లును ఆపారని, అంతే తప్పా వ్యక్తిగతంగా ఏమీ లేదని, ఈ విషయంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైందేనని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసైని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు శనివారం కలిశారు.
లీకేజీ వ్యవహారంపై ఒక నివేదికను ఆమెకు అందజేశారు. అనంతరం బూర నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎంకు ఇష్టమైన సంఖ్య ఆరు అని, అందుకే ఆరు పేపర్లు లీక్ చేశారని ఆయన విమర్శలు చేశారు. వ్యవస్థ లోపం వల్లే ఇన్ని పేపర్ల లీక్ జరిగిందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ అభ్యర్థులందరికీ రూ.లక్ష చొప్పున నష్టపరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఉసురు పోసుకోవద్దని సర్కార్‌కు సూచించారు. శ్రీరామనవమిలోపు అభ్యర్థులకు అపాయింమెంట్ లెటర్ ఇచ్చి సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డెడ్ లైన్ పెట్టారు.
అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల కండ్లలో సీఎం కేసీఆర్ మట్టి కొట్టారని మండిపడ్డారు. తల్లి తండ్రులు అనేక ఇబ్బందులు పడి పిల్లల్ని చదివిస్తున్నారని, వారందరికీ సీఎం కేసీఆర్ లీకేజీలతో కన్నీళ్లు తెప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. పరీక్షల రద్దుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజీ యాధృశ్చికమా? కావాలనే చేశారా అనేది సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి ఎలా గెలిచారనే అంశంపై ఆసక్తిగా రివ్యూ పెట్టిన కేసీఆర్.. పేపర్ లీకేజీపై పెట్టకపోవడం దారుణమని ఈటల ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై సీఎం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని రాజేందర్ డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ బోర్డ్ సభ్యలందరూ రాజీనామా చేయాలన్నారు. ఒక ఉద్యోగి పెన్ డ్రైవ్ లో ప్రశ్న పత్రాలు తీసుకెళ్లే వరకు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈటల డిమాండ్ చేశారు.