దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు బీజేపీ ప్లాన్ : భట్టి విక్రమార్క
భారత దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: భారత దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్కమార్క మాట్లాడుతూ.. ప్రపంచమే ఆశ్చర్యం పోయే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టరన్నారు.
భారత్ జోడో యాత్ర ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాహుల్ ఆలోచనలను భారత్ జోడో సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నదన్నారు. దేశంలో అనేక కులాలు, మతాలు, ప్రాంతాలకు నిలయమని, వాళ్లందరినీ కాపాడేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారం కోసం ఓట్లు పొందడానికి మతం పేరిట భారతదేశంలో చిచ్చు పెడుతుందన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉండటం బీజేపీకి ఇష్టం లేదన్నారు. దేశ సంపద, వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతుందన్నారు.