పీడీఏస్ దందాలో తుపాకుల కలకలం

నిజామాబాద్ నగరంలో పీడీఎస్ దందా నిర్వాహకులు తుపాకులు కలిగి ఉన్న విషయం మరోసారి వెళ్లడైంది.

Update: 2024-01-25 04:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో పీడీఎస్ దందా నిర్వాహకులు తుపాకులు కలిగి ఉన్న విషయం మరోసారి వెళ్లడైంది. బుధవారం హైదరాబాద్‌లోని దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్, కాలా పత్తర్ పోలీసులు సంయుక్తంగా కాలపత్తర్ కు చెందిన రౌడీషీటర్ మొహమ్మద్ అసద్‌ను మరో ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి దేశి వాలి తుపాకీ(‌తపంచా) మూడు బుల్లెట్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో సంబంధిత కంట్రీమేడ్ పిస్టల్‌ను నిజామాబాద్‌లో కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ఒకప్పుడు నిజామాబాద్ సిటీలో టేకు కలప స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్ల వద్ద తుపాకులు దొరికిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రేషన్ దందా నిర్వాహకులు గ్యాంగులను ఏర్పాటు చేసి ఏకంగా తుపాకులతో బెదిరించే స్థాయికి ఎదిగిపోయారు.

ప్రస్తుతం స్మగ్లింగ్‌కు మారుపేరుగా రేషన్ బియ్యం దందా జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతోంది. నగరంలోని కొజ్జా కాలనీ, నిజాం కాలనీ, నెహ్రూ నగర్, ఆటోనగర్‌కు చెందిన కొందరు గ్యాంగులు ఏర్పాటు చేసుకొని రేషన్ బియ్యాన్ని సేకరించి రైస్ మిల్లులకు తరలించి లేదా మహారాష్ట్రకు ఎగుమతి చేసే దందాలో నిమగ్నమయ్యారు. వారికి స్థానిక పోలీస్, సివిల్ సప్లై అధికారుల అండదండలు ఉండడంతో పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.

గత ఏడాది నవంబర్ 8న నగరంలోని నిజాం కాలనీలో స్థానిక పోలీసులు ఒక రేషన్ బియ్యం గోదాంపై దాడి చేశారు. అక్కడ మిర్జా హంజల బేగ్ అనే యువకుడి వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ తుపాకీ బుల్లెట్లు, కత్తులు గొడ్డళ్లు, తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మాన్ అనే వ్యక్తి సంబంధించిన పీడీఎస్ బియ్యం దందాను మీర్జా హంజలబేగ్ నిర్వహిస్తుండగా అతడికి రిజ్వాన్, బర్సాత్ ఆమిర్ అనే ఇద్దరు రౌడీషీటర్లు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అందులో ముగ్గురిని ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు ఆ కేసు ఇంకా విచారణ కొనసాగుతోంది.

హైదరాబాద్ పాతబస్తీ‌లోని కాల పత్తర్‌కు చెందిన కరుడు గట్టిన రౌడీషీటర్ మహమ్మద్ అసద్ నిజామాబాద్ నగరాన్ని షెల్టర్ జోన్‌గా వాడుకుంటున్నాడు. హైదరాబాదులో నేరాలు చేయడం పోలీసులు వెతికితే షెల్టర్ నిజామాబాద్‌కు మార్చడం అతనికి పరిపాటిగా మారింది. గతంలో నిజామాబాద్ నగరంలో రౌడీషీటర్ ఆరిఫ్ డాన్‌నూ చంపుతానని కత్తులతో ముజాహిద్ నగర్‌లోని అతని ఇంటిపై దాడి చేసి బెదిరించిన సంఘటన కూడా ఉంది. గత ఏడాది సిరికొండ మండల కేంద్రంలో పీడీఎస్ దందా నిర్వాహకుడు రెహమాన్ సూచనల మేరకు సిరికొండ మండలంలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యాన్ని సేకరించి నిజామాబాద్ నగరానికి మహారాష్ట్రకు రైస్ మిల్లులకు తరలించే గ్యాంగ్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.

దానితో తన ప్రత్యర్థి అన్సార్‌కు రూ.25 లక్షల డబ్బులు ఇవ్వాల్సిన రెహమాన్ అతన్ని బెదిరించి చంపుతానని సెటిల్మెంట్ చేయాలని కాల పత్తర్‌కు చెందిన నేరస్తుడు మహమ్మద్ అసద్‌‌కు సుపారీ ఇప్పించి రప్పించాడు. సిరికొండ మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో అందుకు సంబంధించిన సెటిల్మెంట్ జరుగుతుండగా అసద్ అతని గ్యాంగ్ బెదిరించడానికి వచ్చిన అన్సార్‌పై కత్తులతో పొడిచి హత్యాయత్నం చేశారు. ఈ మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరోసారి కాలా పత్తర్‌కు చెందిన మహమ్మద్ అసద్ నిజామాబాదులో సెటిల్మెంట్లు చేస్తున్న విషయం బహిర్గతమైనది.

కాల పత్తర్‌కు చెందిన మహమ్మద్ అసద్ అనే రౌడీషీటర్ హైదరాబాద్ పోలీసులు విచారణలో తాను తుపాకీని నిజామాబాద్‌లో కొనుగోలు చేసినట్టు వెల్లడించడంతో పీడీఎస్ దందా నిర్వాహకుల వద్ద తుపాకుల విషయంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2023లో ఇద్దరు రౌడీషీటర్లు ఇబ్రహీం చావుస్ అలియాస్ జంగల్ ఇబ్రహీం, ఆరిఫ్ డాన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జంగల్ ఇబ్రహీం నగరంలోని పీడీఎస్ మాఫియా నుంచి నెలవారి మామూళ్లకు ఒత్తిడి తేవడంతోనే అతనిని మరో రౌడీషీటర్ ఆరిఫ్ డాన్ గ్యాంగ్ ఆధ్వర్యంలో సంది కోసం పిలిచి హత్య చేసిన విషయం తెలిసిందే.

జంగల్ ఇబ్రహీం హత్య కేసులో అతని సోదరి పోలీసులకు తన సోదరుడు హత్యకు పీడీఎస్ గ్యాంగ్ నిర్వాకుడు సూత్రధారి అని ఫిర్యాదు చేయగా పోలీసులు మాత్రం అతని పేరును తొలగించి చార్జిషీట్ నమోదు చేయడం గమనార్హం. జంగల్ ఇబ్రహీం హత్య తర్వాత ఆరిఫ్ డాన్ ను అతని సన్నిహితుడే పథకం ప్రకారం కోర్టుకు హాజరై వస్తుండగా దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. వేరువేరు పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు హత్యలు కేవలం పిడిఎస్ దందా లో విభేదాల కారణమనేది స్పష్టమైనది.

గత నెల చివరి వారంలో రెండు గ్యాంగుల మధ్య మరోసారి ఎవరి హత్యలు జరగకుండా ఒప్పందం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆనాడు జరిగిన సౌదా ( చర్చలలో) కాలపత్తర్ కు చెందిన రౌడీషీటర్ మొహమ్మద్ అసద్ కూడా ఉన్నట్టు వెళ్లడైంది. నిజామాబాద్ నగరంలో పిడిఎస్ దందా నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్ ల అధికారులతో, టాస్క్ ఫోర్స్ పోలీసులతో చట్టపట్టలేసుకొని తిరుగుతున్న విషయం కూడా వెలుగులలోకి వచ్చింది. ఇప్పటికైనా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పిడిఎస్ దందా నిర్వాహకుల పై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Similar News