మహా మానవీయ పండుగ!

భూమిపై ఉన్న ప్రతి ప్రాణి సంక్షేమానికి పాటుపడే చట్టాలను రూపొందించిన పాలకుల్లో అశోకచక్రవర్తిని మించిన వారు లేరు. మానవత్వాన్నే గీటురాయిగా చేసుకొని

Update: 2024-10-12 01:30 GMT

భూమిపై ఉన్న ప్రతి ప్రాణి సంక్షేమానికి పాటుపడే చట్టాలను రూపొందించిన పాలకుల్లో అశోకచక్రవర్తిని మించిన వారు లేరు. మానవత్వాన్నే గీటురాయిగా చేసుకొని పరిపాలన సాగించిన మహామహుడు ఆయన. ప్రపంచ చరిత్రలో అంతటి మానవతావాది ఇప్పటి వరకు లేరు. రాజ్య విస్తరణలో భాగంగా, అంతకు మించి భవిష్యత్ తరాలకు పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకు అనివార్యమైన ఒక పెద్ద యుద్ధం అశోకుడిని మహా మనిషిని చేసింది. ప్రపంచ చరిత్రలో యుద్ధాల రద్దును ప్రకటించిన తొలి చక్రవర్తి, ఏకైక రాజుగా కీర్తి గడించాడు. చక్రవర్తిలో కలిగిన ఈ మహా పరివర్తనే ‘ధమ్మ విజయం’గా, విజయదశమిగా చరిత్రకెక్కింది.

క్రీస్తుపూర్వం 261లో, చక్రవర్తి అయిన తొమ్మిదేండ్లకు కళింగపై అశోకుడు దండెత్తాడు. గణ రాజు ఐళ నాయకత్వంలో కళింగ రాజ్యాలు ఏకమై అశోకుడిని ఎదిరించాయి. ఇరుపక్షాలూ తీవ్రంగా నష్టపోయాయి. లక్ష మందికి పైగా చనిపోయారు. లక్షన్నర మంది క్షతగాత్రులయ్యారు. మరో లక్షమంది పాక్షికంగా దెబ్బతిన్నారు. లక్షన్నర మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. మొత్తం ఐదు లక్షల మందికి వినాశకారిగా కళింగ యుద్ధం ముగిసింది. ప్రపంచం ఇంత ఘోరమైన యుద్ధాన్ని ఎప్పుడూ చూడలేదు. లక్షన్నర మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడి మగధ కారాగారాల్లో బందీలయ్యారు. ఆ మరునాడు ప్రజలు అశోకుడి కళింగ విజయానికి గుర్తుగా దేశమంతా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

యుద్ధాలను రద్దు చేసిన తొలి చక్రవర్తి

ఆ యుద్ధానంతరం అశోకుడిలో పరివర్తన వచ్చింది. తాను చేసిన నరమేధాన్ని చూసి, అశోకుడు చలించిపోయాడు. విజయం లభించినా, అశాంతితో తిరిగి వచ్చిన అశోకుడికి భార్య విదిశాదేవి, బిడ్డలు సంఘమిత్ర, మహేంద్రుల బౌద్ధ సందేశాలు, కొంత ఊరట కలిగించాయి. ఆనాటి బౌద్ధ మహా గురువు మొగ్గలి పుత్తతిస్స (ఉప గుప్తుడు) ప్రబోధాలు విన్న అశోకుడి లో కొత్త ఆలోచనలు రేగి, రక్తం అంటని శాంతి భావాలు చిగురించాయి. తనలోని దుడుకు తనానికి కళ్లెం వేసుకున్నాడు. చండ అశోకుడిగా పేరు పడిన ఆయన కళింగ యుద్ధానంతరం కత్తి దించాడు. కరుణ పతాకాన్ని లేవనెత్తాడు. తాను చేసిన ఈ ఘోరకలిని మరిచిపోయే విధంగా మంచిపనులు చేయాలని నిర్ణయించుకున్నాడు. కళింగులకు దగ్గర కావాలనుకుని కళింగ వనిత కారువాకిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆమె కుమారుడు తివరునికి కళింగ పాలనా బాధ్యతలు అప్పగించాడు. ఈలోపు కళింగ యుద్ధ విజయ ప్రథమ వార్షికోత్సవ సంబరం రానే వచ్చింది. దేశమంతా విజయోత్సవాలకు సిద్ధమవుతోంది. ఇదే మంచి తరుణంగా భావించి, గట్టి నిర్ణయం తీసుకున్నాడు.

ఆయుధాలను త్యజించటమే 'ధమ్మ విజయం'

క్రీ.పూ. 262 ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున 'ఉపాసకునిగా' (గృహస్తుగా ఉంటూ పంచశీల పాటించడం) బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. నవమి రోజున జైళ్లలో బందీలుగా ఉన్న కళింగ సైనికులందరినీ విడుదల చేయాలని ప్రకటించారు. పదోరోజు దశమి. దశమి రోజున ప్రపంచ చరిత్రలో ఏ చక్రవర్తీ చేయని అద్భుతమైన ప్రకటన చేశారు. 'ఇక, ఈ రోజు నుంచి (ఈ విజయ దశమి నుంచి) నేను గానీ, నా వారసులు గానీ ఎవ్వరూ, ఎప్పుడూ యుద్ధాలకు దిగరు. కత్తి చేత పట్టరు. కరుణను చేపట్టే పాలన సాగించారు. ప్రజలందరి సంక్షేమం కోసమే రాజ్యాన్ని పాలిస్తారు' అని ప్రకటించి, ఆయుధాలను మూట కట్టి మూలకు నెట్టేశాడు. అలాగే ఆ రోజున అశోకుడు రెండు ఉరిశిక్ష రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. ఆ రోజు నుంచే ఆయుధాలను వదిలేస్తున్నామని, దీనిని ప్రజలు ‘ధమ్మ విజయం’గా జరుపుకోవాలని ప్రకటించాడు. తన సైన్యాన్ని రద్దు చేయకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించాడు. అనుకున్న ప్రకారమే కళింగ యుద్ధంలో పట్టుబడ్డ ఖైదీలందరికీ రెండున్నర ఎకరాలు భూమిని సర్వ హక్కులతో పట్టాలు ఇచ్చి వారందరినీ విడుదల చేశారు. దశమి రోజున దేశమంతటా అహింసోత్సవాలు నిర్వహించాలని ప్రకటించాడు. అలా అశోకుడు కళింగ విజయాన్ని కరుణ విజయంగా మార్చాడు. ఆ విజయం ధర్మానికి, అహింసకు విజయంగా ప్రకటించాడు. ఇక ఆనాటి నుంచి ప్రతి విజయ దశమి 'అశోక విజయ దశమిగా' దేశమంతటా జరుపుకునేవారు. ఆ పది రోజుల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి నుంచి ప్రతి ఏడాదీ భారతదేశమంతటా జరిగేవి. ఇవి కాలక్రమంలో ‘అశోక విజయదశమి’గా పేరుపడ్డాయి. ఆ తరువాత బౌద్ధంతో పాటు ఈ ఉత్సవాలూ క్రమంగా కనుమరుగయ్యాయి.

రూపు మారిన విజయదశమి

ఇప్పుడు విజయదశమి అంటే అందరికీ గుర్తొచ్చేది ఆయుధ పూజ. మహిషాసుర వధ. ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క పౌరాణిక కథో, చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఆయా మతాల భావజాలానికి అద్దం పడుతుంది. మహిషాసుర మర్థనాన్ని కొత్త రాతి యుగం నాటి మాతృస్వామ్య వ్యవస్థలో జరిగిన వ్యవసాయ గణ విజయంగా భావించే చరిత్రకారులున్నారు. పంటపొలాల్ని పాడుచేసే మహా క్రూరమైన అడవి దున్నల బారి నుంచి తమ పంటచేలను కాపాడడానికి వాటితో పోరాడి తరిమేసిన ఒక గణనాయకురాలి కథే కాలక్రమంలో మహిషాసుర వధగా ఒక మతాచారంగా మారిందనేది కొందరి అభిప్రాయం. అలాగే పురాణ కథల ప్రకారం లంకపై శ్రీరాముని విజయంగా కూడా విజయ దశమిని భావిస్తారు. అలాగే పాండవులు అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు తమ ఆయుధాలను కట్టగట్టి శమీవృక్షం మీద దాచివెళ్తారు. తరువాత కురుక్షేత్ర యుద్ధారంభంలో వాటిని కిందకు దించి, పూజలు చేస్తారు. తాత, తండ్రి, గురువు, బంధుజనుల వినాశనానికి కారణమైన యుద్ధం కోసం విజయుడు (అర్జునుడు) ఆయుధాలనందించిన దశమి కాబట్టి విజయదశమి అని కొందరంటారు. మహిషాసుర మర్థనమైనా, రాముడి విజయమైనా, విజయుని యుద్ధ సన్నాహమైనా ఈ కథలన్నింటిలో ఆయుధాలకు పూజ ప్రధానం.

ఆయుధ పూజలు మొదలయ్యాయి

ఇప్పుడు అందరికీ తెలిసిన విజయదశమి ఇదే. కానీ, కాలగర్భంలో మరుగునపడి పోయిన మహామానవీయ విజయ దశమి 'అశోక విజయ దశమి'. ఆయుధాలకు పూజలు మాని, అహింసోత్సవాలు ఊరూరా జరుపుకున్న మానవీయ మహోత్సవం అది. క్రీ.పూ.188లో ఆఖరి మౌర్య రాజైన బృహద్రదుణ్ణి హత్యచేసి బ్రాహ్మణ సేనాని పుష్యమిత్ర శుంగుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకునే వరకూ అశోక విజయ దశమి అహింసోత్సవంగానే జరిగింది. ఆ తరువాత వైదిక పాలకులు వచ్చి, ఆయుధ పూజలు మొదలు పెట్టారు. అప్పటి నుంచి బౌద్ధం క్రమంగా క్షీణించడంతో అశోక విజయ దశమి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.

అశోక విజయదశమి

ఆధునిక కాలంలో దాదాపు 12 వందల సంవత్సరాల తరువాత చరిత్రలో మరుగున పడిన ఆ మహా మానవీయ విజయ దశమి చరిత్రని ఆధునిక బోధిసత్త్వుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ బయటకు తీశారు. 1956, అక్టోబర్ 14న నాగపూర్‌లో విజయ దశమి రోజున ఆరు లక్షల మందితో బౌద్ధ దీక్ష తీసుకోవడంతో అశోక విజయ దశమిని పునఃప్రారంభించారు. ఈ విజయదశమిని అశోక విజయదశమిగా ప్రకటించారు. ఆనాటి నుంచి 'అశోక విజయ దశమి' వేడుకలు దేశం నలుమూలలకూ వ్యాపించడం మొదలైంది. మహారాష్ట్రతోపాటు, ఉత్తర ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక చోట్ల అశోక విజయ దశమి వేడుకలు జరుగుతున్నాయి. నాగపూర్‌లో ఎప్పటి నుంచో లక్షలాది మందితో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. శాంతికి కేతనంగా, ప్రేమకు చిహ్నంగా, కరుణకు చిరునామాగా, అహింసకు అజారామరరూపంగా నిలిచే, 'అశోక విజయ దశమి' తన కరుణా కాంతులతో భారతదేశంలో వెలుగులు నింపడం ఖాయంగా కనిపిస్తోంది.

-మేకల ఎల్లయ్య,

సీనియర్ జర్నలిస్ట్,

99121 78129

Tags:    

Similar News