ఇది చరిత్ర జ్ఞాపకమేనా?

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రమాదపుటంచుల్లో ఉన్నది. గతమంతా ఘనం..వర్తమానం అస్తవ్యస్తం.. భవిష్యత్ అంధకారం అనే పరిస్థితి

Update: 2024-10-11 03:51 GMT
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రమాదపుటంచుల్లో ఉన్నది. గతమంతా ఘనం..వర్తమానం అస్తవ్యస్తం.. భవిష్యత్ అంధకారం అనే పరిస్థితి సమీపంలోనే కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి చుక్కానిగా నిలిచిన ఉస్మానియా పాలకుల కుట్రలకు బలైపోతోందన్న భయం విద్యార్థులుగా మమ్మల్ని వెంటాడుతోంది.. వెన్నాడుతోంది. ఉస్మానియాను ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ తరహాలో తీర్చిదిద్దుతామన్న గత పాలకుల ప్రకటనలు నీటి మీది రాతలుగానే మిగిలిపోయాయి. దీంతో ఘనచరిత్ర కలిగిన ఉస్మానియా చరిత్ర జ్ఞాపకంగానే మిగిలిపోనుందా అన్నది ప్రశ్న.

ఉస్మానియా, ఎంతోమందికి ఉన్నత చదువులు అందించిన విద్యాలయమే కాదు.. మరెంతోమందికి జీవితాలను ప్రసాదించిన తల్లి కూడా. జీవితం శకలుశకలలుగా రాలిపడుతున్నపుడు జీవితం మీద గట్టిగా నిలబడటం ఎలాగో నేర్పిన, నేర్పుతున్న పోరు పాఠశాల. సామాజిక చైతన్యాన్ని అందిస్తున్న ప్రవాహం. అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలను విశ్లేషించి తెలంగాణనే కాదు.. దేశం దృష్టిని సైతం ఆకర్షించగలిగిన ఉస్మానియా ఎందుకు కొంతకాలంగా పాలకుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి అవుతున్నది? మొత్తంమీద ఉస్మానియాను బలిపీఠంపై కూర్చోబెడుతున్నారా?

ఇది కుట్ర కాదా..?

ఉస్మానియా వర్సిటీలో వేళ్ల మీద లెక్కేసే సంఖ్యలోనే ఆయా డిపార్ట్‌మెంట్లలో రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారు. మిగతా వారంతా పార్ట్ టైం, కాంట్రాక్ట్ వాళ్లు. మరికొద్ది రోజుల్లోనే పలు డిపార్ట్‌మెంట్లలో రెగ్యులర్, పార్ట్ టైం ప్రొఫెసర్లు కూడా లేక మూతబడిపోయే పరిస్థితి రానుంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? అంటే అటువంటిదేమీ లేదు. ప్రస్తుత ఇంచార్జీ వీసీ.. ఐఏఎస్ కాబట్టి ఈ విషయం ప్రభుత్వానికి తప్పనిసరిగా చేరి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి స్వయంగా ఆగస్టులో 15 రోజుల్లోనే వర్సిటీలో కొత్త రిక్రూట్‌మెంట్ అన్నారు.. వీసీల నియామకం అన్నారు. కానీ తాత్కాలికంగా ఇంచార్జీ వీసీలను నియమించి సరిపెట్టుకున్నారు. రెండు నెలలు కావస్తున్నా ఇంకా దీనిపై చెప్పుకోదగ్గ ముందడుగు పడకపోవడం విచారకరం.

మెల్లమెల్లగా వ్యవస్థను నిస్తేజం చేసి..

పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలు బడి మెట్లు ఎక్కకముందు ధనవంతుల పిల్లలు సర్కార్ బడిలో ఓనమాలు నేర్చారు. పేద పిల్లలు సర్కార్ బడి మెట్లు ఎక్కగానే వాళ్లు ప్రైవేట్ విద్యను అందుకున్నారు. తీరా అణగారిన పిల్లలు ప్రైవేట్ విద్యను అందుకోగానే వాళ్లు కార్పొరేట్ విద్య వైపు పరుగులు తీశారు. మేము కార్పొరేట్ వైపు కదలగానే.. వాళ్లు విదేశీ విద్య వైపు మల్లారు. అందుకే పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ వర్సిటీలను శిథిలాలుగా మార్చే పనిలో ప్రభుత్వాలు ఉన్నట్టు ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే స్పష్టం అవుతోంది. గత పదేళ్లుగా ఉస్మానియా నిస్సారంగా మారి ఉసురుమంటుంటే పాలకులు పట్టించుకోవడం లేదంటే కారణం ఏమిటి? ప్రొఫెసర్లు లేక ఓయూ విద్యావ్యవస్థ గాడి తప్పిందనే సంకేతాలను విస్తృతంగా పంపి..విద్యార్థుల శాతాన్ని గణనీయంగా తగ్గించి, న్యాక్ ర్యాంక్ పడిపోయేలా చేసి..విద్యా ప్రమాణాలను దిగజార్చి ఓయూను జ్ఞాపకం చేయాలనే కుట్రపూరిత ఆలోచనను కొట్టిపారేయలేం.

విద్యార్థి సంఘాలు మేల్కొవాలి..!

ఉస్మానియాకు పేదల పిల్లలే వస్తున్నారు. అందుకే ఈ ప్రఖ్యాతి చెందిన విద్యాలయంపై పాలకుల కుట్ర కొనసాగుతోంది. ఈ కుట్రలకు చరమగీతం పాడకపోతే..రేపు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన భవిష్యత్ తరాలు వర్సిటీ విద్యను కూడా అందుకోవడం కష్టమే. ప్రైవేట్‌ స్కూల్ ఎడ్యుకేషన్‌లో చేరడమే భారంగా ఉంది. ఇక ప్రైవేట్ వర్సిటీ చదువులంటారా? అది పేదలకు మరింత భారంగా మారుతుంది. ఉన్నత చదువులు అందని ద్రాక్షగానే మిగిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే విద్యార్థులు..విద్యార్థి సంఘాలు మేల్కొవాలి. లేదంటే పాలకుల కుట్రలకు ఉస్మానియా బలవ్వడం ఖాయం. కానీ, అది జరుగుతుందా? గతంలో ఉమ్మడి రాష్ట్ర పాలకులు వర్సిటీపై కన్నేసి త్రీ స్టార్ హోటల్ చేద్దామని అనుకుంటే తిరగబడిన ఉస్మానియా.. మరోసారి తన సహజ స్వభావాన్ని అందుకోవాలి. నాకెందుకు అనుకుంటే నష్టపోయేది మనమేనని గుర్తించాలి. లేదంటే మన చదువుల తల్లి..చరిత్ర గర్భంలో ఓ జ్ఞాపకంగా మిగిలే ప్రమాదం ఉంది..ఆలోచించండి.

-ప్రశాంత్ పగిళ్ల

ఉస్మానియా విశ్వవిద్యాలయం

95812 62429

Tags:    

Similar News