వనపర్తి కళాశాలకు స్వర్ణోత్సవ శోభ

వనపర్తి కేంద్రంగా 1974 సంవత్సరంలో రాణి లక్ష్మీదేవి అమ్మ డిగ్రీ కళాశాలగా ప్రారంభమైన నేటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 సంవత్సరాల జ్ఞాపకాలు

Update: 2024-12-22 00:30 GMT

వనపర్తి కేంద్రంగా 1974 సంవత్సరంలో రాణి లక్ష్మీదేవి అమ్మ డిగ్రీ కళాశాలగా ప్రారంభమైన నేటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 సంవత్సరాల జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి ముస్తాబవుతుంది. పూర్వ విద్యా ర్థుల ఆత్మీయ కలయికకు సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో చదివిన విద్యార్థులు ఎందరో విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ వంటి వివిధ ప్రభుత్వ సంస్థలలో కీలకమైన హోదాలో పని చేసినటువంటి వ్యక్తులు చేస్తున్నవారు, రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి వాళ్లూ ఎందరో సాహితివేత్తలుగా ఈ కళాశాల నుంచి పూర్వ విద్యార్థులు ఉండడం అభినందనీయం.

కళాశాల చరిత్ర

ఉమ్మడి పాలమూరు జిల్లాలో చదువుల భూమిగా పేరుగాంచిన వనపర్తి పట్టణం కేడిఆర్ నగర్‌లో రాజా రామేశ్వరం కాలంలోని గుర్రాళ్లకు ఆవాసాలుగా ఉన్న ప్రాంతంలో వనపర్తి పట్టణానికి చెందిన టైపు కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రైవేటు డిగ్రీ కళాశాల గా ప్రారంభమై రానురాను వనపర్తి శాసనసభ్యులుగా పనిచేసిన డాక్టర్ ఎ.బాలకృష్ణయ్య గారి కృషితో ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా రూపుమారి ప్రస్తుతం మహిళా డిగ్రీ కళాశాలగా కొనసాగుతున్న ప్రాంగణమే నాటి రాణీ లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల. ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ప్రారంభమై 2005లో డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో అక్కడి నుంచి కళాశాలను గోపాల్‌పేట మార్గంలో నర్సింగాయపల్లి శివారులోకి నూతన భవనంతో ప్రస్తుతం ఉన్నటువంటి కళాశాలగా మార్చడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కళాశాల విశాలమైనటువంటి వాతావరణంలోని చక్కటి తరగతి గదులతో చక్కటి ప్రయోగశాలలను కలిగి ఉండి బి.ఏ, బి.ఎస్ సి, బి.కాం. కోర్సులతో తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో 700 మంది విద్యార్థులకు విద్యను అందిస్తుంది. నాలుగు యూనిట్లలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎన్‌సీసీ క్యాడేట్స్ శిక్షణతో వాళ్లలో జాతీయ భావాన్ని క్రమశిక్షణను నెలకొల్పుతుంది.

ప్రధానాచార్యుల కృషి

కళాశాల ప్రారంభ ప్రధానాచార్యులుగా వల్లపురెడ్డి బుచ్చారెడ్డి నియమించబడ్డారు. ఈయన గొప్ప సాహిత్యకారుడిగా, విమర్శకుడిగా, గ్రంథ పరిష్కార కర్తగా, కథకుడిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ తర్వాత ప్రముఖ సాహితివేత్తగా పేరుగాంచారు. 1980 నుంచి 1991 వరకు కే.యాదారెడ్డి సుదీర్ఘకాలంగా కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేశారు. 1980 నుంచి నేటి వరకు ఈ కళాశాలలో 27 మంది ప్రధానాచార్యులుగా ఉన్నారు. అందులో 2010 సంవత్సరంలో టి.సుశీల ఏడు నెలల పాటు మహిళా ప్రధానాచార్యులుగా పనిచేశారు. 50 వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ కళాశాలకు ఇటీవల కాలంలో కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేసిన డాక్టర్ ఎన్.శ్రీనివాస్ బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం రఘునందన్ కళాశాల ప్రధానాచార్యులుగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 22వ తేదీ ఆదివారం రోజున స్వర్ణోత్సవాలకు కళాశాల సిద్ధమవుతోంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికకు సర్వం సిద్ధం చేసుకున్న వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1974 నుంచి నేటి వరకు చదివిన పూర్వ విద్యార్థులందరూ తమ జ్ఞాపకాలను, తమ ఆలోచనలను, తమ అనుభవాలను పంచుకోవడానికి వేలాదిగా తరలి రావాలని ప్రస్తుత ప్రధానాచార్యులు, అధ్యాపకులు వారిని స్వాగతిస్తున్నారు.

(నేడు రాణి లక్ష్మీదేవి అమ్మ డిగ్రీ కళాశాల, వనపర్తి- స్వర్ణోత్సవాలు)

- ఎజ్జు మల్లయ్య

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వనపర్తి.

91006 10501

Tags:    

Similar News