విశ్వమంతా గణితమయం..!

మనందరి జీవితాల్లో గణితం ఉంటుంది. కానీ చాలా అరుదుగా కొందరి జీవితమే గణితంలో ఉంటుంది. విశ్వ విఖ్యాత గణిత మేధావులు మెచ్చిన భారతీయ

Update: 2024-12-22 01:00 GMT

మనందరి జీవితాల్లో గణితం ఉంటుంది. కానీ చాలా అరుదుగా కొందరి జీవితమే గణితంలో ఉంటుంది. విశ్వ విఖ్యాత గణిత మేధావులు మెచ్చిన భారతీయ గణిత కోహినూర్ వజ్రం శ్రీనివాస రామానుజన్. ఆయన చనిపోయి శతాబ్దం దాటినా నేటి కృత్రిమ మేధతో కూడిన ఆధునిక శాస్త్ర సాంకేతిక రోబోటిక్ యుగంలో కూడా రామానుజన్ ఫార్ములాలు, గణిత సమస్యలు నేటి ప్రపంచం అర్థం చేసుకోలేక పోతుందంటే ఆయన మేధస్సు ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ గాలిని శ్వాసిస్తే ఆయన గణితాన్ని శ్వాసించారు. అంకెల మాయలో ఎన్నో ఆకలితో కూడిన రోజులను అధిగమించారు. అమ్మ నాన్నలతో ఆడుకునే పసిప్రాయంలోనే "అనంతం"తో ఆడుకున్నారు. ఇవన్నీ అతిశయోక్తి కాదని రామానుజన్ ఓ అసాధారణ గణిత 'దైవ'మని ఆయన జీవితాన్ని శోధిస్తే మనకు అర్థం అవుతుంది. 

రాబర్ట్ కనిగెల్ 1991లో రచించిన శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర "The man who knew Infinity" పుస్తకం ఆధారంగా 2015‌లో అదే పేరుతో విడుదలైన బయోపిక్‌లో రామానుజన్ స్ఫూర్తి అనంతమై ప్రకాశిస్తుంది. మాథ్స్ బ్రౌన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామానుజన్ పాత్రకు దేవ్ పటేల్ ప్రాణం పోశారు. మన భారతీయ గణిత శాస్త్రవేత్త గురించి బ్రిటిష్ వారు సినిమా తీసారంటే మనదేశంలో మేధావులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు తదితర వంటి వారి విషయంలో మనం, మన ప్రభుత్వాలు ఎంతో మారాల్సిన, నేర్చుకోవాల్సిన అవసరం వుంది.

నాలుగు వేల అనంతపు శ్రేణుల ఆవిష్కర్త

శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న ఉదయించి 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన రామానుజన్ సృష్టించిన ఓ ఫార్ములాకు నిరూపణ రాబట్టాలంటే ఓ గొప్ప గణిత శాస్త్రవేత్తకే ఓ జీవితకాలం పడుతుందని అంటుంటారు..! అలాం టివి ఆయన దాదాపు 4000 దాకా అనంతపు శ్రేణులతో కూడిన గణిత అద్భుతాలు అన్వేషించారు. నాలుగు పుస్తకాలతో వున్న ఆయన సమస్యలు నేటి ఆధునాతన నవతరపు మేధస్సుకు సవాళ్లని చెప్పవచ్చు. నిరుపేద బ్రాహ్మణ కుటుం బంలో పుట్టి, సనాతన హిందూ సంప్రదాయాలను తన జీవితాంతం అనుసరించిన రామానుజన్ జీవితం కొన్ని శతాబ్దాలకు స్ఫూర్తి పాఠం. గణిత సమస్యలను సాధించడానికి రాసుకునే పేపర్లు కొనే స్తోమత లేని వ్యక్తి న్యూటన్, యూలర్, జాకబ్ వంటి తదితర విఖ్యాత మేధావులతో పోల్చబడ్డాడంటే ఆయన మార్గం శూన్యంలోని అనంతం..! అనంతంలోని శూన్యం..! అనితరసాధ్యం..! విశ్వమంతా గణితమయం.ఈ శతాబ్దపు గణితమంతా రామానుజన్ మయం.

ప్రపంచం అంతా గుర్తించాక..

'1976లో, రామానుజన్ జీవితంలోని చివరి సంవత్సరంలో ఆయన రూపొందించిన అత్యద్భుతమైన కొత్త గణిత సూత్రాలను కలిగి ఉన్న 'లాస్ట్ నోట్ బుక్' కనుగొన్నారు. దీని ప్రాముఖ్యత ప్రపంచ ప్రఖ్యాత సంగీతజ్ఞుడు బీథోవెన్ కూర్చిన 'పదవ సింఫనీ' ఆవిష్కరణతో పోల్చబడింది' అనేది చారిత్రక సత్యం. యావత్ ప్రపంచం రామానుజన్ అపారమైన మేధా సంపత్తిని గుర్తించి కీర్తించాక, రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకుని 2012ను జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా రామానుజన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు.

రామానుజన్‌ని కనుగొనడమే గొప్ప విజయం

గణితంలోనే దైవత్వాన్ని దర్శించిన రామానుజన్ ప్రతిభను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.హెచ్.హార్డీ."రామానుజన్‌ని కనుగొనడమే నా జీవితంలో నేను సాధించిన అతి గొప్ప విజయమని" ఆయన ప్రకటించారంటే రామానుజన్ స్థాయిని మనం ఊహించవచ్చు. రామానుజన్ చివరి దశలో ప్రయాణించిన ఓ ట్యాక్సీ నెంబర్ 1729 ఓ ప్రత్యేకతతో "హార్డీ-రామానుజన్ నెంబర్" గా ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కేవలం 15 సంవత్సరాల వయస్సులోనే ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ రచించిన "Synopsis of Elementary Results in Pure and Applied Mathematics " పుస్తకంలోని సమస్యలకు, ఫార్ములాలకు నిరూపణలు రాబట్టిన రామానుజన్ అనూహ్య రీతిలో గణితంలో ఎలాంటి ప్రత్యేకమైన శిక్షణ లేకున్నా, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్‌గా ఎదిగిన ఓ అ"సామాన్య" భారతీయుడు. లండన్‌లో ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త లిటిల్ వుడ్‌తో కూడా రామానుజన్‌కు మంచి అనుబంధం వుంది. నేడు సాంప్రదాయక, క్వాంటం భౌతిక శాస్త్రంలోని స్ట్రింగ్ థియరీ, బ్లాక్ హోల్స్, విశ్వా ఆవిర్భావం వంటి తదితర శాస్త్రీయ అంశాల్లో రామానుజన్ గణిత పరిశోధనలు ఉపయోగపడటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. "ఈక్వేషన్ అనేది భగవంతుని ఆలోచనను వ్యక్తం చేస్తే తప్ప నాకు ఏమీ అర్థం కాదు" అంటూ తన జీవిత సందేశాన్ని వినిపించిన రామానుజన్‌కు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ..

(నేడు రామానుజన్ జయంతి)

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ

93947 49536

Tags:    

Similar News