డప్పు అంటరానిదైన క్షణాన..

డప్పు చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే ఆదిమ కాలం నాటి చరిత్రకు పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషి మనుగడ మొదలైననాటినుండి

Update: 2024-12-21 09:46 GMT

డప్పు చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే ఆదిమ కాలం నాటి చరిత్రకు పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషి మనుగడ మొదలైననాటినుండి డప్పు మనుగడలో ఉన్నది కాబట్టి. నేటికి ఈ దేశంలో డప్పును అంటి పెట్టుకొని జీవనం సాగిస్తున్న వాళ్లు కోకొల్లలు. తోలు డప్పును తయారు చేసే ఏకైక ఫ్యాక్టరీ కూడా వెలివేయబడిన మాదిగ వాడలే.. కానీ ఇప్పుడు తోలు డప్పుల స్థానంలో ప్లాస్టిక్ కంజర్లు వచ్చాక వీటి ఉత్పత్తి పెట్టుబడిదారుల చేతుల్లోకి పోనైతే పోయింది గానీ దీనికుండబడిన అంటరానితనం మాత్రం కేవలం మాదిగలకే ఆపాదించబడింది.

డప్పు ఒక్క మాదిగ వారిదేనా? కానే కాదు పుట్టుక మాదిగ వాడల్లో ఐనప్పటికీ డప్పు సేవ మొత్తం మానవ పుట్టుక,పెళ్లి నుండి చావు వరకు ఎనలేని పాత్ర కల్గినది. ఈ దేశంలో డప్పు తర్వాత పుట్టిన అనేక రకాలైన వాయిద్యాలకు, వాయిద్యకారులకు ఎనలేని గౌరవమర్యాదలతో పాటుగా పారితోషికాలు సహితం లభించి ప్రపంచ ఖ్యాతిని సహితం గడించిన దాఖలాలు అనేకం. కానీ ఈ విషయంలో డప్పు ఎంతో వెనుకబడిందనే చెప్పుకోవాలి. డప్పుకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకవచ్చిన కుంపటి సూర్య భగవంతం గారు "డప్పుకు శాస్త్రీయత లేదని ఎవరన్నారు? అనేక రకాలైన జతులను కూడ డప్పుపైన పల్కించవచ్చును కానీ డప్పుకు కూడా అది పుట్టిన గూడెంకు ఉన్నటువంటి కులపరమైన అంటరాని కుట్ర జరిగింది" అంటారాయన.

డప్పుకు దొరికిన అరుదైన గౌరవం

ఇటువంటి క్షణంలో డప్పు పైననే (డప్పు పుట్టుక దాని చరిత్ర) తను పీహెచ్‌డి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలు తిరుగుతూ యువకులకు డప్పు వాయిద్యాన్ని ఉచితంగా నేర్పిస్తూ సూర్యభగవంతం గారి శిష్యుడిగా డప్పుకు దేశం నలుమూలల ఖ్యాతిని తీసుకవచ్చేందుకు కృషి సలుపుతున్న వ్యక్తి. అంగడి. భాస్కర్. ఇటీవల 2022-23 సంవత్సరానికి గానూ కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారానికి మన తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికయ్యారు భాస్కర్. కేంద్ర సంగీత అకాడమీ 1954లో ఏర్పడిన నాటి నుండి సుమారు 70 సంవత్సరాల తర్వాత డప్పు వాయిద్యకారుడికి దక్కిన అరుదైన గౌరవం ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నగదు పారితోషకాలు అందించడం పరిపాటినే. ఇదే కోవలోకి ఈ అరుదైన ఘనత సాధించిన డప్పు వాయిద్య కారుడిని గుర్తించవలసిన అవసరం కూడా ఎంతో ఉన్నది.

ప్రపంచ వేదికలపై డప్పు ప్రదర్శన

దేశంలోనే ప్రప్రథమంగా మన రాష్ట్రానికి ఈ అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చిన అంగడి భాస్కర్ మెదక్ జిల్లా మిరిదొడ్డి మండలంలోని అందె గ్రామ వాస్తవ్యుడు. గ్రామం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని అందె భాస్కర్‌గా సుపరిచితుడయ్యాడు. డప్పును ప్రపంచ వేదిక మీద పరిచయం చేయాలనేదే తన ఆశయముగా పెట్టుకుని ఇదే క్రమంలో రాష్ట్రంలో అనేక వేదికల మీద పలు ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాన్ని 2024 నవంబర్-22న దేశ రాజధాని ఢిల్లీలో ఈ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అంటరానిదిగా ముద్రపడిన డప్పుకు ఇదొక అరుదైన గుర్తింపు.

మనందరి వాయిద్య పరికరం

ఎంతో చరిత్ర కల్గిన డప్పును ముందు తరాలకు అందించే క్రమంలో డప్పు వృత్తిపైన ఆధారపడినటువంటి ఎంతో మంది కళాకారులకు కూడా ఆయా ప్రభుత్వాలు పెన్షన్ విధానాన్ని అందించాలనీ ఎన్నోయేండ్లుగా విన్పిస్తున్న డిమాండ్. వీరికి ప్రోత్సాహకాలు అందిస్తే ఎంతోమంది భాస్కర్ వంటి నైపుణ్యం ఉన్నటువంటి డప్పు వాయిద్యకారులు వెలుగులోకి వస్తారు. డప్పు మనందరి వాయిద్య పరికరం. దీనిని మానవ మనుగడలో భద్రపరచుకోవడం మనందరి బాధ్యత. మరీ ముఖ్యంగా ప్రభుత్వాలది కూడా.

వరకుమార్ గుండెపంగు

99485 41711

Tags:    

Similar News