పిల్లల టిఫిన్ ప్లేట్‌లో ఏముంది?

దుకాణంలో ఒక అరటిపండు, ఒక చిప్స్ ప్యాకెట్ కనిపించినప్పుడు తల్లి తన బిడ్డ కోసం ఏది కొంటుంది..? అని ఎవరైనా ప్రశ్నిస్తే నిస్సందేహంగా చిప్స్ ప్యాకెట్

Update: 2024-12-20 01:15 GMT

దుకాణంలో ఒక అరటిపండు, ఒక చిప్స్ ప్యాకెట్ కనిపించినప్పుడు తల్లి తన బిడ్డ కోసం ఏది కొంటుంది..? అని ఎవరైనా ప్రశ్నిస్తే నిస్సందేహంగా చిప్స్ ప్యాకెట్ అని సమాధానం వస్తుంది. ఒకవేళ, తల్లి అలా కొనకపోయినా సరే ఆ అబ్బాయి లేక అమ్మాయి ఆ ప్యాకెట్ మాత్రమే కొనమని అల్లరి చేయడం మనందరికీ తెలుసు. కొత్త జీవిత విధానంలో పిల్లల ఆహారపు అలవాట్లు ఇలా ప్రభావితమయ్యాయి. పోషక విలువలు ఉన్న పదార్థాలు పక్కకు జరిగి, పోషక విలువలు ఏమీ లేని మరింత నష్టం కలిగించే వివిధ రకాల అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్లు పిల్లల టిఫిన్ ప్లేట్ల‌లోకి జొరబడ్డాయి. పిల్లల స్కూల్ బ్యాగుల్లోకి వెళ్లాయి. పిల్లల నోట్లోకి వెళ్లాయి. సంస్కృతిలో భాగమైపోయాయి.

తల్లిదండ్రులు పిల్లలకి సంతృప్తి కలిగించడానికి ఇవే ఇస్తున్నారు. ఒక జామకాయ, ఒక అరటిపండు, ఇంకేమైనా పళ్లు జాతి పదార్థాలు ఈరోజు పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే దృశ్యాలు మాయమైయ్యాయి.

ప్రపంచీకరణ... ప్రాసెస్డ్ ఫుడ్

ప్రపంచీకరణ తర్వాత దేశంలోకి స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో పెట్టుబడులు మాత్రమే రాలేదు. టెక్నాలజీ మాత్రమే రాలేదు. ఈ రెండింటితో పాటు ఎన్నో రకాల వేలకొలది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్టులు కూడా మన షాపింగ్ కార్ట్‌లోకి చేరిపోయాయి. టీవీల్లో అందమైన ప్రకటనలు పిల్లలను మరింత ఆకర్షించగలుగుతున్నాయి. వాటిలో నిజనిజాలు ఏమిటి అనే ప్రశ్న ఎవరికీ రాదు. వచ్చినా సరే సరైన సమాధానం చెప్పే సంస్థలు కనిపించవు. ప్యాకెట్ల లోపల ఏముంది? ఎంత ఉంది? అనే విషయాలు శాస్త్రీయంగా కనిపించవు. ఉన్న ఆ కొన్ని వివరాలు కూడా చదివే ఓపిక తల్లులకూ ఉండదు. పిల్లలకూ ఉండదు. ఇలా ఒక కొత్త సంస్కృతిని ఆధునిక నాగరికత అందించింది. అధిక పంచదార, అధిక ఉప్పు ఈరోజు మన ఆహార పదార్థాలలో విపరీతంగా చేరిం ది. మోతాదుకు మించి వీటిని తీసుకోవడం ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ కేసులు కూడా పెంచడంలో వీటి పాత్ర లేకపోలేదు.

బ్రెయిన్‌వాష్ చేస్తున్న యాడ్స్

అయితే, ఈ మార్పుకి తల్లితండ్రులకూ, పిల్లలకూ తప్పు పట్టి ఏమీ ప్రయోజనం లేదు. వీరు ఈ ప్రకటనల వ్యవస్థలో సమిధలు మాత్రమే. ప్రకటనలే వీటిని పిల్లలకు ఇచ్చేలా వీళ్లను ప్రోత్సహపరుస్తుంటాయి. అవి ఏం చెప్తే అవి మాత్రమే వీరంతా పాటిస్తారు. అలా పాటించగలిగేలా నిరంతరం ప్రకటనలు బ్రెయిన్ వాష్ చేస్తాయి. బయటి దేశాల్లో నైట్ డ్రింక్‌గా వాడే హార్లిక్స్, బోర్న్ విటా లాంటి పానీ యాలు కూడా మన దేశాల్లో పిల్లలకు విపరీతమైన శక్తిని అందిస్తాయని ప్రకటనలతో అమ్మకాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రశ్నించేవారు లేరు. ప్రశ్నించే వారికి సమాధానం చెప్పేవారు లేరు. చాలా కుటుంబాల్లో తల్లులు తల్లిపాలు కూడా ఆపేసి ఈ ప్రకటనల మాయల్లో పడి అందులో ఏవేవో అద్భుతమైన పదార్థాలు ఉన్నాయని ప్రకటనలను నమ్మి ఆ పదార్థాలు, ఆ పాలపొడులు కూడా పిల్లలకు అందించే సంఘటనలు లేకపోలేదు. ఇలా పిల్లల టిఫిన్ ప్లేట్‌లో పిల్లల పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు పక్కకు జరిగి, పోషక విలువలు లేని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆక్రమించి ఎంత దుష్ప్రభావం కలిగించాలో అంత కలిగిస్తున్నాయి. వీటి నుండి తల్లులూ, తండ్రులూ అప్రమత్తత వహించాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది. ఈ విషయంలో చాలామంది శాస్త్రవేత్తలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

సమయం లేకనే ఇన్‌స్టంట్ ఫుడ్స్!

చాలా ఇళ్లల్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉదయాన్నే చాలా తొందరగా లేచి పిల్లల్ని స్కూళ్లలో దించి ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల కారణంగా ఈ హడావుడి మరింత పెరిగింది. ఆఫీసుల్లో కూడా వీలైనంత ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వేల మంది తల్లులు స్కూలుకు వెళ్లే పిల్లల కోసం పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలతో వంటలు వండి పిల్లలకు టిఫిన్ బాక్స్ అమర్చేటంత సమయం, ఓపిక ఉండవు. ఇక అలా పనులకు వెళ్లని తల్లులు కూడా మారిన నాగరికత కారణంగా రాత్రి టీవీలు చూస్తూ, మొబైల్ స్క్రోల్ చేస్తూ చాలా ఆలస్యంగా పడుకొని ఉదయానికి ఇన్‌స్టంట్ ఫుడ్ ఏం దొరుకుతుందా? అని వెతుకుతూ ఆ నూడుల్స్ మీద ఆధారపడి వాటినే పిల్లల టిఫిన్ బాక్స్‌లలో నింపేసే పరిస్థితులు లేకపోలేదు. లేదా భర్త ఉద్యోగం నుంచి చాలా ఆలస్యంగా రావడం వల్ల కూడా ఇలా చాలా రాత్రి వరకు పడుకొనే పరిస్థితి ఉండదు.

పిల్లల్ని కొత్త ప్రపంచంలోకి తోసేశాం

ఇలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి మొత్తం పిల్లల ఆరోగ్యం మీద విపరీతమైన దుష్ప్రభావం కలిగిస్తోంది. ఇలా ఇన్‌స్టంట్ కేకులూ, చాక్లెట్లూ వివిధ రకాల చిప్స్ ప్యాకెట్లూ ఆరగిస్తూ పిల్లలు బరువెక్కుతున్నారు. ప్రైవేటు విద్యా విధానం వల్ల ఆటలు లేక, వ్యాయామం లేక చదువు ఒత్తిడితో ఒక్క దగ్గరే అలా కూర్చుండిపోయి మరింత బరువెక్కుతున్నారు. ఇలా ఒక కొత్త రకమైన ప్రపంచంలోకి పిల్లల్ని తోసేశాం. వారి టిఫిన్ ప్లేట్లను అసహజమైన, హానికరమైన పదార్థాలతో నింపేశాం.

దొరికింది ఆరగించడమే..!

బయటి దేశాల్లో కంజ్యూమర్ ఉద్యమాలు జరుగుతూ నే ఉన్నాయి. ఈ లేబుల్స్‌లో, ఈ ప్యాకెట్లలో ఏం ఉం దో, ఉప్పు ఎంత వేశారో, పంచదార ఎంత వేశారో, ఇతర పదార్థాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయో స్పష్టంగా రాయండి అని ఉద్యమాలు బయట దేశాల్లో జరుగుతున్నాయి. ఇక్కడ అలాంటి ఉద్యమాల్లో ఒక శాతం కూడా మనకు ఇంకా కనిపించడం లేదు. దొరికినవి ఆరగించడం మాత్రమే జరుగుతుంది. ప్రశ్న అనేది ఇక్కడ కనిపించడం లేదు. ఏదో ఒక సంస్థ ఎక్కడో ప్రశ్నించినా అది పక్కకు జరిగిపోతుంది. జరగాల్సిన నష్టం ఆరోగ్యంలో జరిగిపోతూనే ఉంది. పిల్లల ఆరోగ్యం మీద శ్రద్ధ ఇవ్వాల్సిన తల్లిదండ్రులు పోషక విలువలు ఉన్న సహజమైన ఆహార పదార్థాలు ఇవ్వడానికి ప్రయత్నించడం అవసరం.

పోషక విలువలు లేనే లేవు..

2016లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఒక తీర్మానం జరిగింది. పసిపిల్లలకు, చిన్నపిల్లలకు చెందిన సరి కాని ఆహార పదార్థాలను ప్రమోట్ చేయడం అంతం చేయాల్సిందిగా కోరడమైనది. ఈ కోణంలో చూస్తే, పిల్లలకు పనికిరాని వందల వేలకొలది ఫుడ్ ప్రోడక్ట్ లు, వాటి ప్రకటనలను ప్రమోట్ చేయకూడదు. కానీ బలమైన కార్పొరేట్ లాబీ ఇలా కానిస్తుందా? స్వేచ్ఛా వాణిజ్యం పేరుమీద ఏదైనా జరగొచ్చు అని నేడు అర్థం అవుతుంది. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కూడా ప్రకటనలు ముందుకు నడుస్తాయి. నియంత్రించే సంస్థలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆరు రకాల ఫుడ్ ప్రోడక్ట్ లకు సంబంధించిన 432 రకాల సేంపుల్స్‌ని సేకరించి పరిశోధన చేసి చూడగా కార్బోహైడ్రేట్‌లు అధిక పరిమాణంలో కనిపించాయి. ప్రగల్భాలు పలికుతున్నట్టు పోషక విలువలు వీటిలో లేనే లేవు. దానికి తోడు కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన ఆహారం మన చిన్నారుల టిఫిన్ ప్లేట్‌లో పెట్టడం ఎంతవరకు అవసరమో మనం ఆలోచించాలి?

కేశవ్,

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98313 14213

Tags:    

Similar News