గణితానికి గౌరవం - విజ్ఞానానికి మార్గదర్శనం!
ఈ విశాల విశ్వం అంతటా అన్నీ గణితీయంగానే సంభవిస్తాయి అని లైబినిడ్జ్ అనే గణిత శాస్త్రజ్ఞుడు అంటాడు.. మానవుడు పసిబిడ్డగా ఈ భూమిపైకి వచ్చిన నాటి
ఈ విశాల విశ్వం అంతటా అన్నీ గణితీయంగానే సంభవిస్తాయి అని లైబినిడ్జ్ అనే గణిత శాస్త్రజ్ఞుడు అంటాడు.. మానవుడు పసిబిడ్డగా ఈ భూమిపైకి వచ్చిన నాటి నుండి మరణం వరకు ప్రతి క్షణంలో, ప్రతి సందర్భంలో, గణితాన్ని ఉపయోగిస్తాడు. అందువలన గణితం మానవ జీవితంతో అవినాభావ సంబంధం కలిగి ఉంది. ఆడుకునే పిల్లవాని నుండి అంతరిక్ష యాత్రికుని వరకు గణితాన్ని ఉపయోగించకుండా ఉండలేరు. గణితం అంతగా మానవ జీవితంతో పెనవేసుకుంది.
గణితశాస్త్రం అనగానే భారతదేశంలో గుర్తుకు వచ్చే పేరు శ్రీనివాస రామానుజన్ గారు. గణితానికి చేసిన సేవలకు గుర్తుగా మనం అతని జన్మదినమైన డిసెంబర్ 22ను, జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
గణిత శాస్త్రానికి రామానుజన్ సేవలు..
శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22 న తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్‌లో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుండి గణితంలో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. తన 11వ , ఏట రామానుజన్ గారు గణిత శాస్త్రం పట్ల అద్భుతమైన దృష్టిని కనబరిచాడు. సంఖ్యలపై రామానుజన్ గారికి సంపూర్ణ అవగాహన ఉంది. అతను ప్రధాన సంఖ్యలు, వింతచదరాలు(Magic squares), వితత భిన్నాలు(Continued fractions), వర్గమూలాలగూడు(Nested square roots), పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రాల్స్ పై పరిశోధన చేశాడు. ఆయన పేరుపై గల రామానుజన్ సంఖ్య 1729 ఇందుకు ఒక ఉదాహరణ. ఫెలో ఆఫ్ ది రాయల్స్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు రామానుజన్. గణితంపై ఇతనికి ఉన్న పరిశోధనా శక్తి మాత్రం అమోఘం. ఇక రామానుజన్ గారి చివరి దశలో మాక్ తీట ఫంక్షన్స్‌పై చేసిన పరిశోధన ప్రసిద్ధమైంది. ఆయన గణిత శాస్త్రజ్ఞుడు అనేది ప్రధానం కాదు. మానవ మేధస్సు ఎంత చేయగలదో నిరూపించాడు. రామానుజన్ వేసిన ప్రతి అడుగు గణిత శాస్త్రాన్ని ప్రకాశవంతం చేసింది.
గణిత శాస్త్ర ప్రాముఖ్యత
కృత్రిమ మేధస్సు, యంత్ర అధ్యయనం ఈ శతాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు. వీటి మూల సూత్రాలు గణిత శాస్త్రంలో దాగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు గణిత శాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు (AI), యంత్ర అధ్యయన (ML) యుగం లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండాలంటే గణిత విషయాలు అయిన ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌లో పటిమ, రేఖాగణితం, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పై అవగాహన, డేటా మోడలింగ్, విశ్లేషణా సామర్థ్యం అవసరం. కృతిమ మేధస్సు మరియు యంత్ర అధ్యయనం విద్యార్థుల భవిష్యత్తును అద్వితీయంగా చేస్తుంది. ఇలాంటి భవిష్యత్తును అందిపుచ్చుకోవటంలో విద్యార్థులు ముందుండాలి అంటే గణితంపై మక్కువను చిన్ననాటి నుండి పెంపొందించుకోవాలి. గణిత శాస్త్రంకు రామానుజన్ గారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన స్ఫూర్తితో ప్రతి విద్యార్థి గణిత శాస్త్రం పట్ల భయాన్ని వీడి ఆసక్తిని పెంపొందించుకుని భవిష్యత్తు లో వచ్చే సవాళ్లను అధిగమించి జీవితాన్ని సుస్థిరం చేసుకోవాలి.
(రేపు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా)
మహేశ్వరం భాగ్యలక్ష్మీ
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్,
95056 18252