జెండర్ న్యూట్రల్ చట్టాలు కావాలి!
గృహహింస నిరోధక చట్టంని దుర్వినియోగం చేసి తనని, తన కుటుంబాన్ని సతాయిస్తున్న తన భార్య ఆగడాల గురించి బెంగళూరులో 40 పేజీల
గృహహింస నిరోధక చట్టంని దుర్వినియోగం చేసి తనని, తన కుటుంబాన్ని సతాయిస్తున్న తన భార్య ఆగడాల గురించి బెంగళూరులో 40 పేజీల సూసైడ్ నోట్‌ని, 80 నిమిషాల వీడియోని తయారుచేసి మరీ అతుల్ సుభాష్ అనే టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతుల్ సుభాష్ మరణం ఖచ్చితంగా విషాద పరిణామమే. ఈ సందర్భంగా ఆ చట్టం దుర్వినియోగం అవుతుందనీ, అమాయకులైన భర్తలు, వారి కుటుంబాల వారూ బలైపోతున్నారనీ, స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించి భారతదేశపు చట్టాలన్నీ కేవలం పురుషుడినే బోనులో నిలబెడుతున్నాయని, ఇలాంటి పక్షపాత చట్టాల్ని కొనసాగించకూడదన్న అభిప్రాయాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెన్స్ కమిషన్ కావాలి అనే నినాదాలు వినిపిస్తున్నాయి.
నిజమే సుభాష్ భార్య చేసింది ప్రతి హింసా కాదు, ప్రతిఘటనా కాదు. ఆమె గృహహింస నిరోధక చట్టంని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసింది. మృతుడి వెర్షన్ వింటే ఎంతో బాధ కలుగుతుంది. అతని ఆత్మహత్యకు ఆమె కారణమనేది నిస్సందేహం. తాను సంపాదించే ప్రతి రూపాయి తన శత్రువు బలపడటానికే వినియోగింపబడుతున్నదని అతను అన్నాడు. భరణం చెల్లించలేకపోతే సుభాష్ చచ్చిపోవాలని న్యాయస్థానంలో అతని భార్య అన్న మాటకి జడ్జి నవ్వినప్పుడు అతను అతలాకుతలమై పోయాడు. అతని ఆత్మహత్యకి కారకురాలిగా ఇప్పటికే ఆమె మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆమెకి శిక్ష పడినప్పుడు అతనికి న్యాయం జరిగినట్లే భావించాలి.
స్త్రీ రక్షణ చట్టాలే వద్దందామా?
ఐతే మనం గుర్తించాల్సిన విషయమేమంటే సుభాష్‌ది అరుదైన కేసు. స్త్రీల గురించిన రక్షణాత్మక చట్టాలు తీవ్ర విమర్శలకు గురవుతున్న నేపథ్యంలో మన పురుషాధిక్య వ్యవస్థలో పురుషులు స్త్రీలను ఎక్కువగా హింసిస్తారా? లేక స్త్రీలే పురుషుల్ని ఎక్కువగా హింసిస్తారా? అనే ప్రశ్న వేసుకోవాలి. ఏది మెజారిటీ వాస్తవమనేది మనకి తెలియని విషయం కాదు. ఈ చట్టాలలోని లోపాలు ఏమైనా వుంటే పరిహరించుకోవాలి కానీ అసలు ఆ చట్టాలే వద్దంటే, భావోద్వేగాలకు కొట్టుకుపోయి వాటి అవసరాన్ని తిరస్కరిస్తే నాగరిక ప్రయాణం నుండి వెనుకడుగులు వేసినట్లే.
గృహ హింస చట్టం అంత దుర్మార్గమైందా?
అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో ముఖ్యంగా గృహహింస నిరోధక చట్టం తీవ్ర విమర్శలకు గురవుతుంది. మన దేశంలో సాధారణంగా జరిగిపోయే అన్యాయాలకి అలవాటు పడిపోయాం. పురుషుడు స్త్రీని హింసిస్తే ఆ స్త్రీ పట్ల కలిగే సానుభూతి కంటే స్త్రీ చేతిలో హింసకి గురయ్యే పురుషుడి పట్ల ఏర్పడే సానుభూతే పెద్దది. రేసిజం కంటే రివర్స్ రేసిజం ఎక్కువ విమర్శలకి గురవుతుంది. ఎక్కువ చర్చకి దారి తీస్తుంది. ప్రస్తుతం కొన్ని ఫేక్ కేసుల్ని చూపించి హింస నుండి రక్షణ కోసం ఏర్పరిచిన చట్టాల అవసరతను ప్రశ్నించడం జరుగుతున్నది. జెండర్ న్యూట్రల్ చట్టాల కోసం డిమాండ్ పెరుగుతున్నది. అంటే ఇది పురుషాధిపత్య వ్యవస్థ కాదని, స్త్రీలే ఎక్కువగా హింసకి గురవుతున్నారనేది వాస్తవం కాదని, స్త్రీ, పురుషులిరువురూ సమాన స్థాయిలో హింసకి గురవుతున్నారని అనుకోవాలన్నమాట. తొంభై మంది పురుషులు చేసే నేరాలు, పది మంది స్త్రీలు చేసే నేరాలు ఒకే గాటన కట్టి చూడాలన్న మాట. అంటే ఇది లింగ వివక్షకి సంబంధించిన ఈవ్ టీజింగ్, గృహ హింస, ప్రేమించి మోసం చేయడం, గర్భిణిని చేసి బాధ్యతారహితంగా వదిలేయడం వంటి నేరారోపణలు నుండి పురుషులకు దాదాపుగా సేఫ్ పాసేజ్ ఇవ్వడం వంటిదే. రేప్ జరిగిందంటే పురుషుడు స్త్రీని చేశాడా లేక స్త్రీనే పురుషుడిని చేసిందా అని అడగాలన్న మాట. ఇవాళ గృహ హింస చట్టం దుర్మార్గమైందని అనగలిగినప్పుడు రేపెప్పుడో చిన్న పిల్లల మీద లైంగిక అత్యాచారాల నిరోధానికి ఉద్దేశించిన పోక్సో చట్టం కూడా అన్యాయమైందని అనొచ్చు. ఇది వాంఛనీయమా?
ఆ చట్టాలను బలహీనపరిస్తే..
ఆర్థికంగా, సామాజికంగా బలహీన కులాలపై కుల హింస, స్త్రీలపై గృహ హింస ఇంకా కొనసాగుతూనే వున్నాయి. ఆయా పీడిత వర్గాలకు రక్షణగా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చాయి. ఈ చట్టాలు అంత తేలికగా రూపొంది, అమల్లోకి రాలేదు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఆయా వర్గాల డిమాండ్లు చట్ట రూపం తీసుకుని అమల్లోకి వచ్చాయి. అక్కడక్కడా జరిగే దుర్వినియోగాన్ని చూపించి ఈ చట్టాలని బలహీనపరిస్తే లేదా ప్రత్యామ్నాయ చట్టాలను తీసుకొస్తే భారతీయ సమాజం మరింత సంక్షోభంలోకి వెళుతుంది.
స్త్రీ పురుష బంధానికి ఏదీ పూచీ
ఈ సమస్యకి తక్షణం సూచించగలిగిన శాశ్వత పరిష్కారాలంటూ లేవు. వివాహబంధాన్ని ఓవర్ సెంటిమెంటలైజ్ చేసి, విడాకుల్ని సంక్లిష్టం చేసే విధంగా ఉన్న లీగల్ ప్రక్రియల్ని సరళతరం చేయాలి. స్త్రీలు కూడా పురుషులంత చదువుకుంటున్నప్పుడు, సంపాదించగలుగుతున్నప్పుడు, సమాజంలో ఎదగగలుగుతున్నప్పుడు ఇంకా పురుషాధిక్యతని మోసే ప్రజాస్వామికత లోపించిన కుటుంబ బంధాలు ఎక్కువ కాలం నిలవవు. వివాహ వ్యవస్థకి ఆపాదించబడుతున్న పవిత్రత, భార్యాభర్తల సంబంధాలకు పులుముతున్న సెంటిమెంట్లు నిలిచేవి కావు. ఈ కరుకు వాస్తవాన్ని గ్రహించి, అంగీకరించి స్త్రీ పురుష సంబంధం మొత్తం వివాహం, కుటుంబం చుట్టూ తిరగాల్సిన అవసరం పడనప్పుడు, ఒకవేళ విడిపోవాల్సే వస్తే పిల్లల పెంపకంతో సహా బాధ్యతల్ని ఒక సదవగాహనతో పంచుకోగలిగినప్పుడు స్త్రీ, పురుషులిరువురూ ఏ స్థాయిలోనైనా ఒకరినొకరు హింసించుకోలేరు. దోపిడీ చేసుకోలేరు. ఏ ఆధిపత్య భావజాలాలు స్పృశించలేని ప్రేమ సమబంధమొక్కటే ఆరోగ్యకరమైన స్త్రీ పురుష సంబంధానికి పూచీ పడగలదు.
- అరణ్యకృష్ణ
98499 01078