డిగ్రీపై విద్యార్థుల్లో తగ్గుతున్న ఆసక్తి.. ఆ కోర్సుల వైపే యువత పరుగులు

రాష్ట్రంలో డిగ్రీ కోర్సుకు రోజురోజుకూ డిమాండ్ తగ్గిపోతోంది. అందులో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.

Update: 2024-10-12 01:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుకు రోజురోజుకూ డిమాండ్ తగ్గిపోతోంది. అందులో చేరే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు డిమాండ్ ఫుల్‌గా ఉండే డిగ్రీ కోర్సులకు ఇప్పుడు యువత ఏ మాత్రం ఆసక్తి కనబరచడం లేదు. ఇతర కోర్సుల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్‌తో పాటు వృత్తి విద్యా కోర్సుల వైపు యువత పరుగులు తీస్తున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గిపోవడంతో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. దోస్త్ ద్వారా డిగ్రీ సీట్లు భర్తీ చేస్తుండగా ఇప్పటి వరకు కేవలం 43 % మంది యువత మాత్రమే చేరడం గమనార్హం. 57 % సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి. దీన్ని బట్టి డిగ్రీ కోర్సులకు డిమాండ్ ఎంతగా తగ్గిందో అర్థం చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కోర్సులకే సై

తెలంగాణలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఎక్కువ మంది ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు మక్కువ చూపిస్తున్నారు. వాటితో పాటు వృత్తి విద్యా కోర్సుల వైపు పరుగులు తీస్తున్నారు. వృత్తి విద్యా కోర్సుల వల్ల సమయంతో పాటు ఆర్థికంగానూ భారం పడకుండా ఉంటుందని భావించి అంతా అటువైపే పరుగులు తీస్తున్నారు. తెలంగాణలో మొత్తం 1,055 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తం 4,57,704 సీట్లు ఉండగా, 2024-25 విద్యాసంవత్సరానికి 1,96,442 సీట్లు మాత్రమే నిండాయి. అది 42.9 % మాత్రమే. చేరిన 1,96,442 మందిలో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మాయిల సంఖ్య 1,05,329 ఉండగా, అబ్బాయిలు 91,113 మంది మాత్రమే ఉన్నారు.

డిగ్రీలో బీకామ్ వైపే మొగ్గు

తెలంగాణలో డిగ్రీలో చేరిన స్టూడెంట్స్‌లో ఎక్కువ మంది బీకామ్ కోర్సులోనే చేరారు. డిగ్రీలో మొత్తం మొత్తం 1,96,442 మంది చేరగా ఒక్క బీకామ్​‌లోనే 77,469 మంది అడ్మిషన్ తీసుకున్నారు. బీఎస్సీ లైఫ్ సైన్సెస్‌​లో 36,733 మంది, బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ 32,181 మంది జాయిన్ అయ్యారు. బీఏలో 28,362 మంది, బీబీఏలో 15,835 మంది, బీసీఏలో 5170, డిప్లొమా కోర్సుల్లో 556, బీబీఎంలో వంద మంది, బీఎస్‌​డబ్ల్యూలో 25, ఒకేషనల్​‌లో 11 మంది చేరారు. రాష్ట్రంలో మొత్తం 160 ప్రభుత్వ కాలేజీలున్నాయి. వాటిలో 89,337 సీట్లు ఉండగా, 55,361 సీట్లు భర్తీ అయ్యాయి. తెలంగాణలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఖ్య 816. వాటిలో 3,44,793 సీట్లుండగా 1,32,388 మంది మాత్రమే చేరారు. ప్రభుత్వ కాలేజీల్లో చేరిన వారు 61 % ఉండగా ప్రైవేటు విద్యార్థులు 38 శాతంగా ఉన్నారు. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు 79 ఉంటే అందులో 23,574 సీట్లకు 8,693 సీట్లు ఫిల్ అయ్యాయి.


Similar News