Rice Miller : మిల్లర్ నిర్వాకం..రైతు దంపతుల ఆత్మహత్య యత్నం

క్వింటాల్ కు ఏడున్నర కిలోల తరుగు కోతకు రైతు అంగీకరించలేదన్న కారణంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతగా లేదంటూ రైస్ మిల్లర్(Rice Miller)తిప్పి పంపడాన్ని నిరసిస్తూ రైతు దంపతులు(Tribal farmer couple) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

Update: 2024-11-24 08:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : క్వింటాల్ కు ఏడున్నర కిలోల తరుగు కోతకు రైతు అంగీకరించలేదన్న కారణంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతగా లేదంటూ రైస్ మిల్లర్(Rice Miller)తిప్పి పంపడాన్ని నిరసిస్తూ రైతు దంపతులు(Tribal farmer couple) ఆత్మహత్యాయత్నాని(attempts suicide)కి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో చౌళ్లతండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యాజమాని పరిశీలించి నాణ్యత లేదని.. ఏడున్నర కిలోల తరుగుకు ఒప్పకుంటేనే ధాన్యం దిగుమతి చేసుకుంటామని మిల్లు యాజమాని చెప్పాడు.

ఒక కేజీ తరుగుకు మాత్రమే ఒప్పుకుంటానని రైతు చెప్పడంతో అంగీకరించని రైస్ మిల్లు యజమాని ధాన్యాన్ని తిప్పిపంపాడు. దీంతో తీవ్ర మనస్తా పానికి గురైన రైతు గుగులోతు కీమా దంపతులు తమపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఒక క్వింటాకు ఏడున్నర కిలోల తరుగు కోత చేస్తానని మిల్లర్ అంటున్నాడని, అలాగైతే 425బస్తాలకు 13క్వింటాళ్లు తరుగు పోతుందని తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతు దంపతులు వాపోయారు. కౌలు చేసి పంట పండిస్తే మిల్లర్లు తమను దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


Similar News