Disha Special Story: 7 భాషలు 2 లక్షల పుస్తకాలు.. చరిత్రలో నిలిచిన సిటీ సెంట్రల్ లైబ్రరీ

హైదరాబాద్‌(Hyderabad)లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ (City Central Library) పేద విద్యార్థులకు వరంలా మారింది.

Update: 2024-11-12 13:07 GMT

హైదరాబాద్‌(Hyderabad)లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ (City Central Library) పేద విద్యార్థులకు వరంలా మారింది. గ్రూప్స్, ఇతర ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఈ లైబ్రరీ(Library)లో లక్షల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. నిత్యం మూడు నుంచి ఐదు వేల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు, సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన పుస్తకాలు తీసుకెళ్లడంతోపాటు గంటల తరబడి అక్కడే చదువుకొని జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో పాటు గ్రంథాలయ కార్యదర్శి, మెయింటనెన్స్ కమిటీ సభ్యులు మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తు్న్నారు. నిరుద్యోగుల కోసం జీహెచ్ఎంసీ(GHMC) ఆధ్వర్యంలో రూ.5 కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటూ వందల మంది నిరుద్యోగులు ఈ సారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. - మహమ్మద్ నిసార్

2,32,056 పుస్తకాలు

సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రస్తుతం 2,32,056 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో తెలుగు బుక్స్ (Telugu Books) 85,260, ఇంగ్లీష్ (English) 84,982, హిందీ(Hindi) 31,435, ఉర్దూ (Urdu) 17,290, తమిళ్ (Tamil)3,121, కన్నడ (Kannada) 35,565, సంస్కృతం(Sanskrit) 2,629, మరాఠీ (Marathi)3,704 పుస్తకాలు ఉన్నాయి. ప్రధానంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌(Competitive Exams)కు సంబంధించిన బుక్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్‌(School Education)కు సంబంధించి టెన్త్, ఇంటర్, డిగ్రీ పుస్తకాలతో పాటు జనరల్, నవలలు, కథలు, సాహిత్యం, రచనలు, బాల సాహిత్యం, చరిత్ర, వైద్యం, రాజకీయాలు, చట్టం, వైద్యం, కల్పన వంటి బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలకు చెందిన 26 పేపర్లు నిత్యం దర్శనమిస్తాయి. రీడర్స్ ప్రతి రోజూ వందలమంది వచ్చి పేపర్లు చదువుతూ తమకు కావాల్సిన సమాచారాన్ని నోట్ చేసుకుంటున్నారు. గతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం పాత పేపర్లు కావాలనుకునే వారికి 1974 సంవత్సరం నుంచి ప్రింట్ అయిన న్యూస్ పేపర్లూ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా బుక్స్ కావాల్సి వస్తే లైబ్రరీలో ఏర్పాటు చేసిన ‘డిమాండ్ బుక్’ (Demand Book)లో రాస్తే చాలు వారం రోజుల లోపే తెప్పించే ఏర్పాటు చేస్తున్నారు.

రూ.150తో లైఫ్ టైం మెంబర్‌షిప్(Life time membership)

సాధాణంగా బయట మార్కెట్‌లో ఒక పుస్తకం కొనాలంటే కనీసం రూ.100 నుంచి రూ.500 వరకూ వెచ్చించాల్సి వస్తుంది. అలా ఐదు పుస్తకాలు కొన్నా రూ.2,000 వరకూ ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రజల కోసం అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. పుస్తకాలు కావాలనుకునే వారు ఒక్క సారి రూ.150 కట్టి మెంబర్‌షిప్ తీసుకుంటే చాలు జీవితాంతం బుక్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ లైబ్రరీలో 30,663 మంది మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఓ వ్యక్తి ఐదు మెంబర్‌షిప్‌లు తీసుకునే ఫెసిలిటీ ఉంది. అయితే పుస్తకం తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చిన తర్వాతే మరికొన్ని బుక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.

రూ.5కే కంప్యూటర్ వసతి

ఈ రోజుల్లో ఏ సమాచారం కావాలన్నా, లేదా బుక్స్‌, ఎగ్జామ్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్నా కంప్యూటర్ సదుపాయం ఉండాల్సిందే. అనేక మంది పేద విద్యార్థులకు కంప్యూటర్ సదుపాయం ఉండక పోవచ్చు. అలాంటి విద్యార్థులు, నిరుద్యోగులకు సిటీ సెంట్రల్ లైబ్రరీలో కేవలం రూ.5కే గంట పాటు కంప్యూటర్ ఉపయోగించుకునే వసతి ఉంది. ఇక్కడున్న 17 కంప్యూటర్లను రోజుకు 20 నుంచి 50 మంది ఉపయోగించుకుంటున్నారు.

వేర్వేరుగా కూర్చునే వెలుసుబాటు

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ గ్రంథాలయంలో మహిళలు, పిల్లలు, సీనియర్ సిటీజన్స్ వేర్వేరుగా కూర్చొని పుస్తకాలు చదివేందుకు వసతి ఉన్నది. ఒక్కో హాల్‌లో వారికి కావాల్సిన వసతులన్నీ అందుబాటులో ఉన్నాయి. నిత్యం సుమారు 500 మంది మహిళలు వచ్చి పుస్తకాలు చదవడంతో పాటు తమకు కావాల్సిన బుక్స్ తీసుకెళ్తుంటారు.

ఆకలి తీర్చుతున్న రూ.5కే మధ్యాహ్న భోజనం

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చిక్కడపల్లి(Chikkadapally) ప్రాంతంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉన్నది. అందుకే దీని పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా హాస్టల్స్ (Hostels)ఉన్నాయి. గ్రూప్స్(Groups), పోలీస్ కానిస్టేబుల్ (Police Constable Job), బ్యాంకు ఉద్యోగాల(Bank Jobs)తో పాటు ఇతర జాబ్స్ (Jobs)కోసం ప్రిపేర్(Preparation) అవుతున్న తెలంగాణలోని సుమారు అన్ని జిల్లాల అభ్యర్థులు నలుగురైదుగురు కలిసి ఆర్థిక స్థోమత లేక రూమ్స్ తీసుకొని ఉంటున్నారు. అలాంటి వారి కోసం లైబ్రరీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.5కే మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. దీన్ని అనేక మంది ఉపయోగించుకుంటున్నారు. దీంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం ఉదయం వేళ ఫ్రీగా టిఫిన్ పెడుతున్నాయి.

5గంటలకే ప్రారంభం..

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పుస్తకాలతో కుస్తీలు గ్రూప్స్‌తో పాటు ఇతర ఉద్యోగాలు సాధించేందుకు రాష్ట్రంలోని సుమారు అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి చదువుకుంటున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతున్నారు. నిత్యం వందలమంది అభ్యర్థులు లైబ్రరీ హాల్స్‌తో పాటు ఆరుబయట ఉన్న చెట్ల కింద కూర్చొని పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు.

సద్వినియోగం చేసుకోండి

లైబ్రరీలో ప్రస్తుతం 66 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 40 మంది ఔట్ సోర్సింగ్, 38 మంది పార్ట్‌టైం పద్ధతిలో పని చేస్తున్నారు. ఈ లైబ్రరీ పరిధిలో 81 శాఖలు పని చేస్తున్నాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.25 లక్షలు మంజూరు అవుతున్నాయి. పేపర్ బిల్స్, ఇతర సదుపాయాలు, మెయింటెనెన్స్ కోసం వీటిని ఖర్చు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే పాఠకులకు మెరుగైన వసతులు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ గ్రంథాలయాన్ని తెరిచే ఉంచుతాం. వేలమంది విద్యార్థులు గ్రూప్స్, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడి పుస్తకాలు చదివే చాలా మంది మంచి ఉద్యోగాలు సాధించారు. పాఠకులకు కావాల్సిన పుస్తకాలన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. మంచి జాబ్ సాధించిన వారు గ్రంథాలయానికి ఏదో ఒక రకంగా విరాళం ప్రకటించడం సంతోషకర విషయం. ప్రయివేటుగా రూ.వేలు ఖర్చు చేసే బదులు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు తీసుకొని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. సిటీలోని ప్రతి ఒక్క లైబ్రరీని పాఠకులు సద్వినియోగం చేసుకోవాలి.

- పద్మజ, సిటీ సెంట్రల్ లైబ్రరీ సెక్రెటరీ

8 మందితో డెవలప్‌మెంట్ కమిటీ

సిటీ సెంట్రల్ లైబ్రరీలో సిబ్బంది కొరత ఉండడంతో ఇక్కడికి నిత్యం వస్తున్న వారితో అడిషనల్ కలెక్టర్, గ్రంథాలయ పర్సనల్ ఇన్‌చార్జి పళని కథిరవన్ ఆదేశాల మేరకు నాలుగు నెలల క్రితం డెవలప్‌మెంట్ కమిటీ వేశాము. ఏ సమస్య వచ్చినా గంటల వ్యవధిలోనే పరిష్కరించేలా ఈ కమిటీ పర్యవేక్షిస్తున్నది. ఇక్కడికొచ్చే చిన్నారులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్, నిరుద్యోగులకు వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షణ సాగుతున్నది. నిరుద్యోగులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాలు సాధించాలి.

- బొల్లం మహేందర్, డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు

20 ఏండ్ల నుంచి వస్తున్నా

నేను 20 ఏండ్లుగా సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తున్నా. ప్రతి రోజూ సుమారు 5 నుంచి 6 గంటల పాటు ఇక్కడే గడుపుతా. గ్రంథాలయంలో చాలా రకాల బుక్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వసతులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ప్రశాంతమైన వాతావరణంలో వందలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడి పుస్తకాలు తీసుకొని చదివిన వారు మంచి స్థానాల్లో ఉన్నారు.

- డి.హనుమంతరావు, సీనియర్ సిటిజన్

ప్రశాంత వాతావరణంలో చదుకుంటున్నాం

నేను రెండేండ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రతి రోజూ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి చదుకుంటున్నా. ఇక్కడ వేలసంఖ్యలో బుక్స్ ఉన్నాయి. కాంపిటీటిక్స్ పుస్తకాలు సైతం అనేకంగా ఉన్నాయి. మాకు ఏమైనా బుక్స్ కావాలంటే డిమాండ్ బుక్స్‌లో రాస్తే చాలు.. వారం లోపలే తెచ్చి ఇస్తున్నారు. కంప్యూటర్ సదుపాయాన్నీ ఉపయోగించుకుంటున్నాము. నాతో పాటు ఇక్కడ ఉండి చదివిన ఇద్దరికి ఈ మధ్యే కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగం వచ్చింది.

- సుమన్, వరంగల్

‘మధ్యాహ్న భోజనం’తో ఎంతో ఉపయోగం

ఆరేండ్లుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవున్నా. నాతో పాటు చాలా మంది ఉదయమే ఇక్కడికి వచ్చి పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. వసతులు చాలా బాగున్నాయి. మనకు కావాల్సిన పుస్తకం దొరుకుతుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.5 కే భోజన వసతి కల్పిస్తున్నారు. పేద విద్యార్థులకు ఈ లైబ్రరీ దేవాలయంగా ఉందని చెప్పొచ్చు.

-సురేష్, జగిత్యాల

Tags:    

Similar News