వెంటనే కుల గణన చేపట్టాలి : రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

కుల గణన చేయాలని గతంలో రాహుల్, కాంగ్రెస్ నేతలంతా పట్టుపట్టారని, మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు చేపట్టడంలేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు.

Update: 2024-09-21 14:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కుల గణన చేయాలని గతంలో రాహుల్, కాంగ్రెస్ నేతలంతా పట్టుపట్టారని, మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు చేపట్టడంలేదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప నేత అని, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి అని కొనియాడారు. చేనేత రంగానికి ఎంతో కృషి చేశారన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఆధారపడి పని చేసే కార్మికులు చేనేత కార్మికులేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది, టీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసింది కూడా లక్ష్మణ్ బాపూజీ అని వ్యాఖ్యానించారు. కుల గణన చేయాలని కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ గతంలో డిమాండ్ చేశారని, ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉండి కూడా ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి 9 నెలలు గడిచినా ఆ ఊసెత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు కావస్తున్నా ఎందుకు చేయడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే కుల గణన చేపట్టి ఎన్నికలకు పోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల పేరిట నెరవేరని హామీలు ఇచ్చి మోసం చేసినట్లే.. ఈ అంశంపై సైతం మోసం చేయొద్దన్నారు. ఓబీసీలపై రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఫైరయ్యారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ చరిత్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.


Similar News