పీఏసీ ఔనత్యం తగ్గించేందుకు బీఆర్ఎస్ కుట్ర: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

పీఏసీ ఔనత్యం తగ్గించేందుకు బీఆర్ఎస్ కుట్రకు పాల్పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

Update: 2024-09-21 15:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పీఏసీ ఔనత్యం తగ్గించేందుకు బీఆర్ఎస్ కుట్రకు పాల్పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లలో జరిగిన ఆర్ధిక విధ్వంసం నుంచి బయటికి రాకుండా బీఆర్ఎస్ అడ్డుపడుతుందన్నారు. రూల్స్ ప్రకారమే పీఏసీ నియామకం జరిగిందని స్పష్టం చేశారు. సీనియర్ సభ్యులు గాంధీని పీఏసీ చైర్మన్‌గా చేశారని గుర్తు చేశారు. గతంలో ప్రగతి భవన్‌లోగా నిర్ణయం జరిగేదని విమర్శించారు. ఎంఐఎంకు గతంలో ఎట్లా ఇచ్చారో.. అందరికీ తెలుసునని స్పష్టం చేశారు. స్పీకర్‌పై ఇష్టం వచ్చిన పదజాలం‌తో మాట్లాడం సరికాదన్నారు. గత పదేళ్లలో జరిగిన ఖర్చుల విధ్వంసంపై పీఏసీ తేల్చునుందని అన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిజాయితీగా పనిచేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వంశీ‌కృష్ణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యులు పీఏసీ లోపలికి రాగానే బైకాట్ చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్ చేస్తే తప్పా అంటూ విమర్శించారు. 2018లో కాంగ్రెస్ ఎల్‌వోపీగా భట్టి విక్రమార్క ఉంటే సహించారా.. అంటూ ప్రశ్నించారు. దళితుడిని ప్రతిపక్ష నేతగా ఉండనిచ్చారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇది హిస్టరీగా మిగులుతుందని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించారని గుర్తు చేశారు. పనిచేసే ప్రతి ఒక్కరికి గౌరవం దక్కిందన్నారు. రూ.796 కోట్లు లాభాలను కార్మికులకు పంచనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్మణ్​ మాట్లాడుతూ.. దేశంలో సైనికుల మాదిరిగా, సింగరేణి కార్మికులు పని చేస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీలో కార్మికుల పిల్లలకు 25 శాతం వాటా ఇచ్చే అంశం పరిశీలన చేస్తున్నామని అన్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ.. సింగరేణి‌లో కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలు బంద్ చేస్తే బెటర్ హితవు పలికారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. హరీష్ రావు చేతలు, మాటలు చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు అంటే అబద్దాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నీళ్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. హరీష్‌రావు సుందిళ్లకు వెళ్లి పరిశీలిస్తే బాగుంటుందని అన్నారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులతోనే వ్యవసాయానికి నీళ్లు వచ్చాయన్నారు.


Similar News