ట్రైబల్ ఏరియాల్లోని గర్భిణీలకు శుభవార్త

ట్రైబల్ ఏరియాల్లోని గర్భిణీలను ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్(ఈడీడీ) కంటే ముందే ప్రభుత్వాసుపత్రులకు తరలించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు.

Update: 2024-09-21 16:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ట్రైబల్ ఏరియాల్లోని గర్భిణీలను ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్(ఈడీడీ) కంటే ముందే ప్రభుత్వాసుపత్రులకు తరలించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. శనివారం ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ట్రైబల్ ఏరియాల్లో గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల పరీక్షలు, సౌకర్యాలు కల్పించాలన్నారు. అంబులెన్స్ ల సంఖ్యను పెంచాలన్నారు. నాలుగు ఐటీడీఏల పరిధిలో వెంటనే ఈ రూల్ ను ఇంప్లిమెంట్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్యం తనిఖీలు జరపాలని సూచించారు. ప్రతి నెల తనకు రిపోర్టును అందజేయాలన్నారు. దీంతో పాటు ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కూడా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల హెచ్‌వోడీలు నెలకు కనీసం రెండుసార్లు జిల్లాల్లోని హాస్పిటల్స్‌ను విజిట్ చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటల్ హెచ్‌ఆర్, అటెండెన్స్‌, ఎక్విప్‌మెంట్, మెడిసిన్, సానిటేషన్, డైట్ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖాన్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని, డ్యూటీ హవర్స్‌లో డాక్టర్లు, సిబ్బంది తప్పకుండా హాస్పిటల్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అటెండెన్స్‌ వేస్తున్నదెవరో తెలుసుకోవడం కోసం, బయోమెట్రిక్ మిషన్లు ఉన్న ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ కర్ణన్, డీఎంఈ డాక్టర్ వాణి, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీంద్రనాయక్ లు పాల్గొన్నారు.


Similar News