Thummala Nageswara Rao: కొనుగోళ్ల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
పంట సాగుచేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: పంట సాగుచేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ‘వరి కొయ్యలు కాల్చడం- నష్ట నివారణ చర్యలు’పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెక్రటేరియట్ నుంచి కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొని రైతులతో ముచ్చటించారు. పత్తి, ధాన్యం కొనుగోలు సెంటర్లలోని రైతులతోనూ మాట్లాడి అక్కడి సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి, పత్తి కొనుగోలు విషయంలో సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కామారెడ్డి, జనగాం, మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాలోని రైతులతో వరి కొనుగోలు కేంద్రాల నుండి ముఖాముఖి మాట్లాడి, వరి ధాన్యం దిగుబడులు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంబంధించిన సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
వరి, మొక్కజొన్న, పత్తి పంటలు, కోసిన తర్వాత, వాటి అవశేషాలను రైతులు కాల్చి వేయడం వలన, భూమిలో సింద్రియ కర్బన శాతం తగ్గుతుందని వెల్లడించారు. దీంతో భూమి కొంతకాలానికి నిస్సారంగా మారుతుందని, పంట అవశేషాలను రైతులు కాల్చకుండా, భూమిలో కుళ్లి పోయేటట్లు చేసుకోవాలన్నారు. రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ‘వరి కొయ్యలు కాల్చడం-నష్ట నివారణ చర్యలు’ పై వ్యవసాయ శాస్త్రవేత్త టి.ప్రభాకర్ రెడ్డి, కేవీకే, పాలెం నుంచి దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి ఉదయ్ కుమార్, వ్యవసాయ అదనపు సంచాలకుడు విజయ కుమార్, పౌర సరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.