వర్షపు నీటిలో చిక్కుకున్న బస్సు.. ప్రయాణికులను రక్షించిన స్థానికులు
సోమవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.
దిశ, వెబ్ డెస్క్ : సోమవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి ఎక్కడిక్కడ రోడ్లపై వరద నీరు నిలిచి పోయింది. కాగా నిజామాబాద్ పట్టణంలోని రైల్వేకమాన్ వద్ద కూడా భారీగా వరద నీరు నిలిచి పోయింది. అటుగా వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ వరద నీరు కొద్దిగానే ఉంటుందని భావించి, బస్సును ముందుకు నడిపాడు. కానీ నీటి మధ్యలోకి వెళ్ళాక బస్సు సగం వరకు నీటిలో మునినిపోయి బస్సులోకి నీళ్ళు చేరాయి. బస్సు కూడా ముందుకు కదలక పోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేదాక వేచి చూడకుండా వెంటనే బస్సులోని ప్రయాణికులను కిటికీ అద్దాలు పగలగొట్టి సురక్షితంగా బయటికి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద బస్సును నీళ్ళలో నుండి బయటకు లాగారు. తక్షణమే స్పందించిన స్థానికులను పోలీసులు, ప్రయాణికులు అభినందించారు.