బీఆర్ఎస్‌కు కౌంటర్ స్ట్రాటజీ రెడీ చేస్తున్న కాంగ్రెస్.. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్

విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు దీటైన సమాధానాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నది.

Update: 2024-09-23 02:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు దీటైన సమాధానాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వడంపై ఆలోచిస్తున్నది. ఇందుకోసం ఒకవైపు మీడియా ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మంత్రులు చొరవ తీసుకోవడంతోపాటు సోషల్ మీడియాను సైతం విస్తృతంగా వాడుకోవాలని భావిస్తున్నది. అన్ని డిపార్టుమెంట్లకు ఉన్న ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ల నుంచి ఎప్పటికప్పుడు ఆ విమర్శలకు కౌంటర్‌గా వివరాలను వెల్లడించడం ఒక మార్గమనే అభిప్రాయానికి వచ్చినట్లు సచివాలయ వర్గాల సమాచారం. దీనికి తోడు ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగాన్ని సైతం బలోపేతం చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి.

సోషల్ మీడియా ద్వారా..

పరిపాలన విషయంలో విపక్షాల విమర్శలు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా జనంలోకి వెళ్లడం ద్వారా స్టేట్ ఇమేజ్‌కు ఇబ్బందికరంగా మారుతున్నదనే భావనతో ప్రభుత్వం కౌంటర్ స్ట్రాటెజీ దిశగా కసరత్తు చేస్తున్నది. అమృత్ స్కీమ్‌లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. దీనికి కౌంటర్‌గా వెంటనే మంత్రి పొంగులేటి ద్వారా ఘాటుగానే రిప్లయ్ ఇప్పించిన ప్రభుత్వం అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా దీటైన జవాబు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. సంబంధిత డిపార్టుమెంట్లకు ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఇందుకు వేదికగా ఉపయోగించుకోవాలన్నది ఒక ఆలోచన. పార్టీ తరపున వేర్వేరు అకౌంట్లతో సోషల్ మీడియాలో విపక్షాల విమర్శలకు పోస్టింగులు దర్శనమిస్తున్నా.. ప్రభుత్వపరంగానే జవాబు ఇవ్వాలని, విపక్షాల విమర్శల్లో నిజం లేదనే అభిప్రాయానికి వచ్చేలా వాస్తవాలను వెల్లడించాలని అనుకుంటున్నది.

స్టేట్ ఇమేజ్ విషయంలో నో కాంప్రమైజ్

పరిపాలనపై ఫోకస్ పెట్టి వివిధ శాఖల రివ్యూలో తలమునకలై ఉన్న సమయంలో విపక్షాల విమర్శలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దీంతో అన్ని డిపార్టుమెంట్లకు ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఇప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే మరింత యాక్టివ్ చేయాలని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు, టెండర్లు.. ఇలాంటి విషయాల్లో బీఆర్ఎస్ విమర్శలు చేయగానే అంతే స్పీడ్‌తో కౌంటర్ ఇవ్వడంపై సర్కారు దృష్టి సారిస్తున్నది. ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కొత్త యూనిట్లను స్థాపించడానికి ముందుకొస్తున్న సమయంలో బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం తప్పనిసరి అనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ఇమేజ్ విషయంలో రాజీ పడొద్దని ఇప్పటికే పలువురు అధికారులకు సీఎం సూచించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితుల్లో పాత ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని చక్కదిద్దుతూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ విమర్శలు, దాని వెనక ఉన్న రాజకీయ ఉద్దేశం, ప్రభుత్వాన్ని చికాకు పెట్టాలన్న కుట్ర తదితరాలను పరిగణనలోకి తీసుకుని కౌంటర్ స్ట్రాటెజీకి పదును పెడుతున్నది.

వాస్తవాలు వెల్లడించేలా..

ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత పరిపాలనలో అధికార, విపక్షాలు బాధ్యతతో ఉండాలని, అభివృద్ధికి పరస్పరం సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఒకవైపు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, అందులో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల స్థాపనకు విదేశీ కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరుగుతున్న సమయంలో నగరానికి, రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చేలా బీఆర్ఎస్ వ్యవహరించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఆ పార్టీ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్న సమయంలో ప్రభుత్వ విభాగాలు, అధికారులు మరింత బాధ్యతతో ఉండాలని, ఆ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చి ప్రజలకు వాస్తవాలు వెల్లడించి ఆ పార్టీ ట్రాప్‌లో పడకుండా చూడడం తక్షణ అవసరమని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. అన్ని విమర్శలకూ రాజకీయంగానో, మరో రూపంలోనో మంత్రులే చొరవ తీసుకోడానికి బదులుగా సంబంధిత శాఖల అధికారులు సైతం ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా రియాక్ట్ కావాలని సీఎం చెప్పినట్లు తెలిసింది.

స్పెషల్ టీమ్ కసరత్తు!

స్టేట్ డిజిటల్ మీడియా విభాగాన్ని మరింత యాక్టివ్ చేసి అన్ని శాఖల అకౌంట్ల ద్వారానూ అప్‌డేట్‌లతో కూడిన పోస్టింగుల ద్వారా ప్రజలకు వివరాలను వెల్లడించాలన్నది ఈ ఆలోచన వెనక ఉద్దేశం. స్టేట్ ఇమేజ్‌ను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలని అనుకుంటున్న విపక్షాలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిపై చట్టపరంగా తీసుకునే చర్యల గురించీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తగిన ఆధారాల్లేకుండా ఇష్టారీతిలో విపక్ష నాయకులు స్టేట్‌మెంట్లు ఇస్తే ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రానున్న రోజుల్లో ప్రభుత్వ యాక్టివిటీస్‌ను, రియాక్షన్‌ను సోషల్ మీడియా ద్వారా కూడా వీలైనంతగా ప్రజల్లోకి వెళ్లేలా ఆలోచనలకు పదును పెడుతున్నది. బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సైతం పార్టీపరంగా సోషల్ మీడియా ప్రచారాన్ని ఉధృతం చేసే ప్లానింగ్ ఎలాగూ ఉన్నది. ఇప్పటికే ఆ దిశగా ప్రత్యేక టీమ్ కసరత్తు మొదలుపెట్టింది.


Similar News