తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం?.. బీఆర్ఎస్ నేత కేటీఆర్

తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని, చెత్తా చెదారం మధ్యలోనే బతుకమ్మ ఆడుకోవాల్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-10-05 07:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని, చెత్తా చెదారం మధ్యలోనే బతుకమ్మ ఆడుకోవాల్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పైసలు లేవు.. పండగ ఏర్పాట్లు ఏలా? అని ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. బతుకమ్మ అంటే ఈ ముఖ్యమంత్రికి గిట్టదా.. పట్టదా అని, ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా? అని ప్రశ్నించారు. అలాగే పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా అని, చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా అని అడిగారు.

పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి.. చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయని, రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిందని నిలదీశారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా మహిళలకు లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బతుకమ్మ చీరెలను రద్దు చేసి, ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 


Similar News