నెరవేరని ‘ఎమ్మెల్యే’ కల.. రాజకీయాలపై చెరగని ముద్రవేసిన నూకల నరేష్ రెడ్డి

నూకల నరేష్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

Update: 2024-10-05 08:02 GMT

దిశ, మరిపెడ : నూకల నరేష్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తనదైన పాత్ర పోషించారు ఆయన. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో 2010లో కేసీఆర్‌తో కలిసి తన ప్రయాణాన్ని కొనసాగించిన ఆయన మారుతున్న రాజకీయ పరిస్థితుల దృశ్య గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కుటుంబ నేపథ్యం.!

నూకల నరేష్ రెడ్డి తల్లిదండ్రులు నూకల రఘునాధ రెడ్డి మనోరమ. భార్య రజినమ్మ, కుమారులు అనిరుద్ రెడ్డి, అభినవరెడ్డి. 1951 జన్మించిన నరేష్ రెడ్డి వయసు 73 సంవత్సరాలు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం 05.42 నిముషాలకు తుది శ్వాస విడిచారు. ఈయనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఆయనకు తన సొంత గ్రామమైన పురుషోత్తమగూడెంలో 300 ఎకరాలు భూమి ఉంది. తన వ్యవసాయ క్షేత్రానికి "ఏరువాక"అని కూడా పిలుస్తారు.

నెరవేరని ఎమ్మెల్యే కల

జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ నూకలకు కాలం కలిసి రాలేదు.1989లో హైకమాండ్ టికెట్ ఇచ్చినప్పటికీ ఇక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ టికెట్ రెడ్యానాయక్‌కు వెళ్ళింది. 1994లో నూకలకే టికెట్ కన్ఫామ్ అంటూ ప్రచారంలో జరిగింది. అయినప్పటికీ అధిష్ఠానం టికెట్ రెడ్యాకు ఇవ్వడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండు స్థానంలో నిలిచాడు. 1999 టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గంలోని రాయపర్తి మండల జడ్పీటీసీగా 2000 నుంచి 2005 సంవత్సరం వరకు పదవిలో కొనసాగారు. అనంతరం 2009లో ఎస్టీ రిజర్వుడు కావడంతో పోటీలో పాల్గొనే పరిస్థితి లేకపోయింది. 2010 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. అనంతరం మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

రాజకీయ దూరందరుడు.!

రాజకీయాల్లో గెలుపు ఓటమిలు ఏ విధంగా ఉన్నప్పటికీ రాజకీయ చాణిక్యుడిగా నూకల పేరు సంపాదించుకున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయా అనుభవం కలిగిన నాయకుడిగా యువతను రాజకీయల్లోకి ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర పోషించాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన శిష్యులు ఎంతోమంది పదవులు అనుభవిస్తున్నారు.

యువతకు ప్రోత్సాహం.!

చదువు, క్రీడల పట్ల ఆసక్తి కనపరిచే యువతకు నూకల ఆపన్నహస్తం అందించేవాడు. ఇందులో భాగంగా స్నేహ యూత్‌ని స్థాపించి సేవా కార్యక్రమాలు కొనసాగించారు. దీని ద్వారా ఎంతోమందికి లబ్ధిచేకూరిందనే చెప్పాలి.

నేడు అంత్యక్రియలు.!

నూకల మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలమైన మరిపెడ మండలం, పురుషోత్తమగూడెంలోని ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. జిల్లాలోని వివిధ పార్టీల శ్రేణులు, నాయకులతో పాటు ప్రజలు తరలివచ్చి నూకలకు నివాళి అర్పించారు. రాజకీయ ప్రముఖులు సైతం నరేష్ రెడ్డిని కడచూపు చూసి వెళ్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Similar News